Cultural Genocide In Tibet: టిబెట్‌పై చైనా తన ఉక్కుపాదాన్ని మరింత బిగిస్తోంది. ప్రపంచం దృష్టి పడకుండా, టిబెటన్ల అస్తిత్వాన్ని, వారి సాంస్కృతిక వారసత్వాన్ని సమూలంగా చెరిపివేసేందుకు డ్రాగన్ కంకణం కట్టుకుంది. మత స్వేచ్ఛను హరిస్తూ, బౌద్ధమతారాధనపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తూ, కనీవినీ ఎరుగని రీతిలో చైనా ప్రభుత్వం దమనకాండకు పాల్పడుతోంది. ఇటీవలే, వందలాది బౌద్ధ స్తూపాలను నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేసి, టిబెటన్ల మనోభావాలను దెబ్బతీసింది. అసలు టిబెట్‌లో ఏం జరుగుతోంది..? చైనా ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తోంది..?
300కు పైగా బౌద్ధ స్తూపాలను ధ్వంసం:
భారత్‌లోని ధర్మశాల కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ (CTA) వెల్లడించిన వివరాల ప్రకారం, చైనా ప్రభుత్వం టిబెట్‌లోని కార్జే ప్రాంతంలో 300కు పైగా బౌద్ధ స్తూపాలను ధ్వంసం చేసింది. వీటిలో జంగ్‌అంగ్ బౌద్ధమఠం సమీపంలోని మూడు భారీ స్తూపాలు కూడా ఉన్నాయి. స్థానిక బౌద్ధులు, ప్రజలు అత్యంత పవిత్రంగా పూజించే పద్మసంభవుడి (గురు రిన్‌పోచే) విగ్రహాన్ని, అలాగే సెర్థార్ బౌద్ధ సంస్థ వ్యవస్థాపకులైన కెన్పో జిగ్మే ఫుంట్సోక్ విగ్రహాన్ని కూడా చైనా అధికారులు కూల్చివేశారు.ఈ విధ్వంసం మే లేదా జూన్ 2025లో జరిగినట్లు తెలుస్తోంది.
ALSO READ: https://teluguprabha.net/international-news/india-pakistan-unsc-kashmir-terrorism/
చైనా సైన్యం, అధికారులు స్థానిక టిబెటన్లను భయభ్రాంతులకు గురిచేస్తూ, వారిపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారని CTA ఆరోపించింది.ఈ విధ్వంసం గురించిన సమాచారం బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు, చైనా ప్రభుత్వం ఆ ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేసింది. ఎవరైనా ఈ విషయాల గురించి మాట్లాడినా లేదా సమాచారాన్ని పంచుకోవడానికి ప్రయత్నించినా, వారిపై “దేశ రహస్యాలను బయటపెట్టడం” అనే నేరం కింద కేసులు నమోదు చేసి, అరెస్టు చేస్తున్నారు.ఆ ప్రాంతంలోకి ఎవరూ రాకుండా, అక్కడి నుండి ఎవరూ బయటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కెన్పో టెంగా వంటి మత పెద్దలను గృహనిర్బంధంలో ఉంచి, వారి ఆధ్యాత్మిక కార్యకలాపాలను పూర్తిగా నిషేధించారు.
చైనా ప్రభుత్వ నియంత్రణ:
చైనాలో మతపరమైన కార్యకలాపాలపై కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి నియంత్రణను కలిగి ఉంది. ప్రభుత్వం అధికారికంగా బౌద్ధం, టావోయిజం, క్రైస్తవం, ఇస్లాం మతాలను గుర్తించినప్పటికీ, వాటి కార్యకలాపాలను కఠినంగా నియంత్రిస్తుంది.మతపరమైన విద్యపై నిషేధం ఉంది. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే మతపరమైన కార్యకలాపాలు జరగాలని, లేనిపక్షంలో మతపరమైన నిర్మాణాలను సులభంగా కూల్చివేస్తామని చైనా ప్రభుత్వం హెచ్చరిస్తోంది. డిసెంబర్ 1, 2024న జారీ చేసిన డిక్రీ నెం. 22 ప్రకారం, జనవరి 1, 2025 నుండి అన్ని మఠాలు ప్రభుత్వ కఠిన నియంత్రణలో పనిచేయాలని ఆదేశించింది.
ALSO READ: https://teluguprabha.net/news/will-crush-your-economy-warns-us-senator-to-india-china/
ఈ చర్యలు టిబెటన్ బౌద్ధమతాన్ని నాశనం చేసి, వారి సాంస్కృతిక గుర్తింపును చెరిపివేయడానికే అని సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ విమర్శిస్తోంది. ఇది టిబెట్ సాంస్కృతిక మారణహోమానికి పాల్పడటమేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


