China Floods: చైనాలోని గాన్సు ప్రావిన్స్ లో భారీ వరదలు సంభవించాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఆకస్మిక వరదలతో అల్లకల్లోలంగా మారింది. గతనెలలో భారీ వర్షాలతో ఉత్తర బీజింగ్‌లో 44 మంది మృతి చెందారు. ఈ నెలలో సంభవించిన వరదలతో 10 మంది మృతి చెందారు. 33 మంది గల్లంతు అయ్యారు.
యుజోంగ్ జిల్లాలోని లాంజౌ సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ విపత్కర ప్రభావానికి నాలుగు గ్రామాల్లో విద్యుత్, టెలికాం సేవలు నిలిచిపోయాయి. 4,000 మందికిపైగా ప్రజలు నాలుగు గ్రామాల్లో చిక్కుకు పోయారు. ప్రతి సంవత్సరం ఈ సమయంలో చైనాలో వర్షాలు కురుస్తాయి. ఈసారి అధిక మోతాదులో వర్షాలు కురవడంతో విపత్కర పరిస్థితులను అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్నారు. దక్షిణ చైనా మాన్సూన్ ప్రభావంతో గ్వాంగ్‌డాంగ్, పియర్ల్ రివర్ డెల్టాలో భారీ వర్షాలు సంభవించాయి.
Read more: https://teluguprabha.net/international-news/ntel-ceo-lip-bu-tan-controversy/
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. తక్షణమే గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించాలని తెలిపారు. ముంపు ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని జిన్ పింగ్ హామీ ఇచ్చారు.
ఇలాంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి చైనా ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వరదల వల్ల చైనాకు ఇప్పటిదాకా 54.11 బిలియన్ యువాన్లు నష్టం వాటిల్లిందని అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ తెలిపింది.


