China Embassy: సాధారణంగా ఎంబసీలు అనేవి రెండు దేశాల మధ్య ఉన్న దౌత్య సంబంధాలను బలపరిచే కేంద్రాలుగా పనిచేస్తాయి. కానీ చైనా లండన్‌లో నిర్మించాలనుకుంటున్న అతిపెద్ద దౌత్యకార్యాలయం మాత్రం మామూలు నిర్మాణం కాదని పలువురు భావిస్తున్నారు. టవర్ ఆఫ్ లండన్‌కు అతి సమీపంలో రాయల్ మింట్ ప్రాంతంలో ఈ నిర్మాణం చేపట్టబడుతోంది. దీనివల్ల బ్రిటన్‌కి భద్రతాపరమైన ఆందోళనలు పెరిగినట్టు తెలుస్తోంది.
ఇంతకుముందు, యూకే రహస్య నిఘా సంస్థ ఎంఐ5, అలాగే స్కాట్లాండ్ యార్డ్ కూడా ఈ నిర్మాణానికి సంబంధించి హెచ్చరికలు జారీ చేయగా, అప్పట్లో అనుమతులు నిలిపివేశారు. కానీ తాజా రాజకీయ పరిణామాలతో పాటు ప్రభుత్వం మారడంతో చైనా ఈ నిర్మాణాన్ని మళ్లీ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ఎంబసీ నిర్మాణ ప్రదేశం లండన్ ఫైనాన్షియల్ హార్ట్ అనే అతి సున్నితమైన ప్రాంతానికి బాగా దగ్గరగా ఉండటంతో, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా దీనిపై అభ్యంతరం తెలిపింది. అంతేగాక, గతంలో వచ్చిన నివేదికల ప్రకారం, ఈ భవనంలో బేస్‌మెంట్ సూట్లు, సొరంగ మార్గాలు వంటి గూఢచర్యానికి అనుకూల వసతులు కూడా ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
చైనా దౌత్యకార్యాలయం పేరుతో ‘కల్చరల్ ఎక్స్‌ఛేంజ్ సెంటర్’ అనే విభాగాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చూస్తోంది. అయితే అమెరికాకు చెందిన ఒక మాజీ భద్రతా నిపుణుడు ప్రకారం, సాధారణంగా ఈ తరహా సాంస్కృతిక మార్పిడి కేంద్రాలు గూఢచర్య కార్యకలాపాలకు దాచిన ముఖాలు కావచ్చని హెచ్చరిస్తున్నారు. అందుకే, బ్రిటన్ అధికారులు అక్కడి కొన్ని నిర్మాణాలు వారి తనిఖీల్లోకి రాకుండా మినహాయించాలని చైనా కోరినట్టు సమాచారం.
ఇంతకు ముందు చైనా 2018లో రాయల్ మింట్ ప్రాంతంలోని సుమారు 5.4 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇది గతంలో బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన స్థలం. ప్రాచీనకాలంలో బ్లాక్ డెత్ సమయంలో శవాల కోసం, తరువాత రాయల్ నేవీ శిక్షణకు ఈ స్థలం ఉపయోగపడింది. ఇప్పుడు చైనా ఇక్కడ ఐరోపాలోనే అతిపెద్ద దౌత్య కార్యాలయాన్ని నిర్మించాలనుకుంటోంది. ఇందులో 225 నివాస గృహాలు, సాంస్కృతిక కేంద్రం వంటి వసతులు ఉండనున్నాయి. వాషింగ్టన్ డీసీలో చైనా ఎంబసీతో పోలిస్తే, ఇది రెండింతల భారీదిగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ నిర్మాణంపై పలుచోట్ల నిరసనలు కూడా జరిగాయి. ఈ స్థలంలో ఎంబసీ ఏర్పడితే బ్రిటన్ భద్రతకు ముప్పు ఏర్పడవచ్చని పలువురు భావిస్తున్నారు. ఇకపోతే, బ్రిటన్ ప్రభుత్వం ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.