అంతర్జాతీయ రాజకీయాలు ఈ మధ్య కాలంలో ఆసక్తికరంగా మారాయి. పలు దేశాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆశ్చర్యకరంగా మారాయి. అందులో భాగంగానే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సుమారు పదిహేను రోజుల పాటు మాయమయ్యారు. గత మే 21 నుండి జూన్ 5 వరకూ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రజల్లో ప్రత్యక్షంగా కనిపించలేదు. సుమారు 15 రోజుల పాటు అతని మాయమవడం చైనా రాజకీయాల్లో పలు ఊహాగానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో జిన్ పింగ్ లేని సమయంలో చైనాలో పాలనా పగ్గాలు నిజంగా ఎవరి చేతిలో ఉన్నాయి? పార్టీ నేతల మధ్య అధ్యక్ష పదవిపై ఆశలు చిగురించాయా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
ఈ క్రమంలోనే ఈ నెల 6, 7 తేదీలలో బ్రెజిల్‌లో జరగనున్న బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశానికి జీ జిన్‌పింగ్ హాజరు కావడం లేదు. ఇది అతని అధ్యక్ష పదవీకాలంలోనే తొలిసారి. ఆయన బదులుగా చైనా ప్రధాని లీ కియాంగ్ ఆ దేశ ప్రతినిధిగా హాజరుకాబోతున్నారు. ఈ పరిణామం జీ జిన్‌పింగ్ మెల్లిగా బలహీనపడుతున్న సంకేతమా? అనే సందేహాలు బయటకు వస్తున్నాయి.
జీ జిన్‌పింగ్ కేవలం అధ్యక్షుడిగానే కాక, చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్‌గా కూడా సేవలందిస్తున్నారు. అయినప్పటికీ, ప్రస్తుతం పాలనా వ్యవహారాల్లో సెంట్రల్ మిలిటరీ కమిషన్ తొలి వైస్ చైర్మన్ అయిన జాంగ్ యూక్సియా ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటున్నట్టు వార్తలు చెబుతున్నాయి. పలువురు సీనియర్ కమ్యూనిస్టు నాయకులు జాంగ్‌కు మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. జీ నాయకత్వంపై ప్రజల్లో అసంతృప్తి, ఆర్థిక సమస్యల కారణంగా ఆయన ప్రభావం తగ్గుతున్న భావన పెరుగుతోంది.
చైనా ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. నిరుద్యోగం పెరుగుతోంది, రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతోంది. ఇలాంటి సంక్షోభాల నేపథ్యంలో జిన్‌పింగ్ నాయకత్వంపై ప్రజలు, వ్యాపారవర్గాలు భిన్నంగా ఆలోచిస్తున్నాయి. వృద్ధి చెందుతున్న అసంతృప్తి నేపథ్యంలో, కొత్త నాయకత్వానికి అవకాశాలు ఇవ్వాలని అక్కడి ప్రజలు, వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. టెక్నోక్రాట్ వాంగ్ యాంగ్ (70) పేరు ప్రస్తుతం జీ జిన్‌పింగ్ వారసుడిగా చర్చకు వస్తోంది. వాంగ్ ఉదారవాద, సంస్కరణలవైపు మొగ్గుచూపే నేతగా పేరుపొందారు. చైనా పాలకవర్గంలో కొన్ని కీలక సైనికాధికారులు, రాజకీయ నేతలు మార్పులకు దోహదపడతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
భారతదేశంపై ప్రభావం
చైనాలోని ఈ పరిణామాలు భారతదేశానికి కూడా కీలకంగా మారవచ్చు. చైనా అంతర్గతంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు, దృష్టిని మళ్లించేందుకు సైబర్ దాడులు, అంతర్జాతీయంగా భారత ప్రతిష్టపై దెబ్బలు కలిగించే చర్యలు తీసుకునే అవకాశమున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల భారత్ సెక్యూరిటీ పరంగా అప్రమత్తంగా ఉండటం అవసరం. జిన్‌పింగ్ పరిపాలనపై ఎన్నో అనుమానాలు నెలకొన్న ఈ సమయంలో, చైనా రాజకీయ వ్యవస్థలో మార్పులు ప్రారంభమైపోయాయని విశ్లేషకుల అభిప్రాయం. దేశంలో రాజకీయ, ఆర్థిక వాతావరణం ఊహించని మార్గంలో ప్రయాణిస్తుండగా, చైనా భవిష్యత్తు ఆసక్తికరంగా మారుతోంది.