జలుబు చేసినపుడు దగ్గు రావడం సహజం. కొందరికి స్పైసీ ఫుడ్, మసాలాలు ఉన్న ఆహారం తీసుకుంటే దగ్గు వస్తుంది. ఓ పట్టాన వదలదు. రకరకాల సిరప్ లు, కషాయాలు వాడితేగానీ దానికి ఉపశమనం ఉండదు. కానీ ఓ మహిళకు దగ్గడంతో పక్కటెముకలు విరిగిపోయాయట. ఈ విషయం తెలిసి వైద్యులే ఆశ్చర్యపోయారు. చైనాలోని షాంఘై నగరానికి చెందిన హువాంగ్ అనే మహిళ ఇటీవల ఘాటైన ఆహారం తీసుకుంది. దాంతో ఆమెను దగ్గు ఊపిరాడనివ్వకుండా చేసింది. దగ్గుతున్న సమయంలో ఛాతీలో నొప్పి వచ్చినా అదే తగ్గిపోతుందిలే అని అశ్రద్ధ చేసింది.
ఆ తర్వాత నొప్పి ఎక్కువవడంతో.. వైద్యుల వద్దకు వెళ్లింది. ఆమెకు ఛాతీలో నొప్పికి గల కారణం తెలుసుకునేందుకు వైద్యులు స్కానింగ్ చేశారు. ఆ రిపోర్టులో మహిళ ఛాతీలోని నాలుగు పక్కటెముకలు విరిగిపోయినట్టు కనిపించడంతో షాకయ్యారు. అందుకు వైద్యులు చెప్పిన కారణం ఏంటో తెలుసా ? బాధిత మహిళ ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ బరువు ఉండటం. తక్కువ బరువు ఉండడం వల్ల శరీరంలో ఎముకలకు ఆధారంగా ఉండే కండరం ఎదగలేదని, దీంతో ఆమె దగ్గినప్పుడు అవి విరిగిపోయాయని చెప్పారు. ప్రస్తుతం బాధిత మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని, కోలుకున్న తర్వాత వ్యాయాయం, సరైన భోజనం తీసుకోవడం ద్వారా కండరాన్ని పెంచుకోవచ్చని వైద్యులు సూచించారు.