Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్UNGA: ఉక్రెయిన్‌లో పరిస్థితులపై ఐరాసలో భారత్‌ ఆందోళన

UNGA: ఉక్రెయిన్‌లో పరిస్థితులపై ఐరాసలో భారత్‌ ఆందోళన

UNGA: రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే, ఇరు దేశాల మధ్య యుద్ధంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పే మార్గాలకు భారత్‌ (India) మద్దతిస్తుందని ఐక్యరాజ్యసమితి (United Nations)లోని శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ (Ukraine) పరిస్థితిపై భారత్‌ ఆందోళన చెందుతోందని హరీశ్‌ పేర్కొన్నారు. యుద్ధం కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం సరైనది కాదని చెప్పుకొచ్చారు. యుద్ధం వల్ల సమస్యలకు పరిష్కారాలు లభించవని గుర్తుచేశారు. ఈ ఘర్షణలను ఆపేందుకు జరిగే అన్ని ప్రయత్నాలకు భారత్‌ పూర్తిగా మద్దతిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దౌత్యపరమైన మార్గాల్లోనే యుద్ధం ముగుస్తుందని తాము భావిస్తున్నామన్నారు. ఇటీవల ఆ దిశగా జరిగిన పలు ప్రయత్నాలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Read Also: Trump: ‘డిపార్ట్ మెంట్ ఆఫ్ వార్’- రక్షణ శాఖ పేరు మారుస్తూ ట్రంప్ నిర్ణయం

ట్రంప్, పుతిన్ ల సమావేశంపై చర్చ

కాగా.. ఇటీవలే అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ల మధ్య సమావేశం జరిగింది. యుద్ధం ముగించే అంశంపై జరిగిన ఈ సమావేశాన్ని కూడా ఐక్యరాజ్యసమితిలో హరీశ్‌ ప్రస్తావించారు. ఆ తర్వాత వాషింగ్టన్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, యూరోపియన్‌ నేతలతోనూ ట్రంప్‌ మాట్లాడిన విషయాన్ని పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కూడా ఈ అంశంపై పుతిన్‌, జెలెన్‌స్కీలతో పాటు యూరోపియన్‌ నేతలతో పలుసార్లు మాట్లాడినట్లు తెలిపారు. ఈ ప్రయత్నాలన్నీ ఫలించి.. కీవ్‌లో తిరిగి శాశ్వత శాంతి నెలకొంటుందని తాము విశ్వసిస్తున్నట్లు వెల్లడించారు.  యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై భారత్‌ విచారం వ్యక్తం చేస్తోందని హరీశ్‌ పేర్కొన్నారు. వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించడం అందరికీ ప్రయోజనకరమన్నారు. ఇది యుద్ధాల శకం కాదని భారత ప్రధాని మోదీ అనేక సందర్భాల్లో చెప్పిన విషయాన్ని హరీశ్‌ పునరుద్ఘాటించారు. అంతేకాకుండా, ఇంధన ధరలు పెరగడంతో సహా సంఘర్షణ వల్ల ఏర్పడే ప్రపంచ పరిణామాలపై దృష్టి సారించాలని చెప్పారు. ఆర్థిక పతనాన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్న మిగిలిన దేశాల ఆందోళనలను పరిష్కరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

Read Also: Harish Rao: కవిత సంచలన వ్యాఖ్యల వేళ కాంగ్రెస్ పై హరీష్ విమర్శలు

 తాత్కాలిక స్పీకర్ల జాబితాలో మోదీ

ఉక్రెయిన్ విదేశాంగశాఖ డిప్యూటీ మంత్రి మర్యానా బెట్సాతో సహా 40 మందికి పైగా సభ్యులు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని ఉక్రేనియన్ వార్తా వెబ్‌సైట్ ఫ్రీడమ్ నివేదించింది. సెప్టెంబర్ 9న అధికారికంగా 80వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఆ సమావేశాల సన్నాహాల్లో భాగంగానే జరిగిన చర్చలో హరీశ్ పాల్గొన్ననారు. అంతేకాకుండా, GA-80వ సెషన్ జనరల్ డిబేట్ తాత్కాలిక స్పీకర్ల జాబితాలో ప్రధాని మోదీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 26న జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. అందుకోసమే త్వరలోనే అమెరికాకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad