Congo Coltan Mine Landslide Tragedy : మనం చేతిలో పట్టుకునే స్మార్ట్‌ఫోన్ నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల వరకు వాడే అత్యాధునిక టెక్నాలజీ వెనుక ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం చెమట, రక్తం దాగి ఉన్నాయి. అదే డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఖనిజ సంపదకు నిలయమైన ఆ గడ్డపై తాజాగా ప్రకృతి ప్రకోపం వందలాది ప్రాణాలను బలితీసుకుంది. తూర్పు కాంగోలోని ఒక ప్రధాన ఖనిజ గనిపై కొండచరియలు విరిగిపడటంతో కనీసం 200 మంది కార్మికులు మట్టిలోనే కలిసిపోయారు.
మృత్యు గనిలో అసలేం జరిగింది : కాంగోలోని నార్త్-కివు ప్రావిన్స్‌లో ఉన్న రుబాయా కొల్తాన్ గని వద్ద బుధవారం జరిగిన ఈ ఘోర ప్రమాదంపై శనివారం తిరుగుబాటుదారులు అధికారిక ప్రకటన చేశారు.
వరుణుడి విలయం – మట్టిలో సజీవ సమాధి: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రుబాయాలోని కొల్తాన్ గని ఒక్కసారిగా కుప్పకూలింది. “ప్రస్తుతానికి మా అంచనా ప్రకారం 200 మందికి పైగా మరణించారు. చాలా మంది ఇంకా మట్టిలోనే కూరుకుపోయి ఉన్నారు, వారిని వెలికితీసే ప్రయత్నాలు సాగుతున్నాయి” అని తిరుగుబాటుదారులు నియమించిన గవర్నర్ ప్రతినిధి లుముంబా కాంబెరే ముయిసా వెల్లడించారు. గాయపడిన వారిని రుబాయాలోని ఆరోగ్య కేంద్రాలకు తరలించారు.
తిరుగుబాటుదారుల గుప్పిట్లో సంపద: ఈ ఘోర ప్రమాదం జరిగిన ప్రాంతం ప్రస్తుతం ‘M23’ అనే తిరుగుబాటు దళం ఆధీనంలో ఉంది. రువాండా మద్దతు ఉన్న ఈ గ్రూపు, గత మే నెలలో రుబాయా పట్టణాన్ని స్వాధీనం చేసుకుంది. ప్రపంచానికి అవసరమైన టాంటాలమ్ (కొల్తాన్ నుంచి తీసే లోహం) సరఫరాలో 15 శాతానికి పైగా ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతుంది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, ఈ గనుల ద్వారా M23 తిరుగుబాటుదారులు నెలకు కనీసం 8 లక్షల డాలర్ల (సుమారు రూ. 6.7 కోట్లు) ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
మానవతా సంక్షోభం – అంతం లేని పోరు: తూర్పు కాంగో దశాబ్దాలుగా ప్రభుత్వ దళాలు మరియు వివిధ సాయుధ ముఠాల మధ్య సాగుతున్న ఘర్షణలతో “ముందు నుయ్యి వెనుక గొయ్యి” అన్న చందంగా మారింది. ఈ అంతర్యుద్ధం కారణంగా ఇప్పటికే 70 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అమెరికా జోక్యంతో కాంగో-రువాండా మధ్య ఒప్పందం కుదిరినా, క్షేత్రస్థాయిలో తుపాకుల మోత ఆగడం లేదు.
ఖనిజాల వేటలో ప్రాణాలు పణంగా : ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల తయారీలో కీలకమైన ‘టాంటాలమ్’ ఖనిజం కోసం కార్మికులు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఇక్కడ తవ్వకాలు జరుపుతుంటారు. రక్షణ చర్యలు శూన్యం కావడంతో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం భారీగా ఉంటోంది. తాజాగా జరిగిన ఈ ప్రమాదంతో తిరుగుబాటుదారులు తాత్కాలికంగా మైనింగ్‌ను నిలిపివేసి, గని సమీపంలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయమని ఆదేశించారు.

