Thursday, May 22, 2025
Homeఇంటర్నేషనల్ఆసియాలో కోవిడ్-19 విజృంభణ.. సింగపూర్, హాంకాంగ్‌లో పెరుగుతున్న కేసులు..!

ఆసియాలో కోవిడ్-19 విజృంభణ.. సింగపూర్, హాంకాంగ్‌లో పెరుగుతున్న కేసులు..!

ఆసియాలో కోవిడ్-19 మరోసారి కలకలం రేపుతోంది. ఇటీవల సింగపూర్, హాంకాంగ్ వంటి ప్రముఖ నగరాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయని అక్కడి ఆరోగ్య శాఖలు వెల్లడించాయి. ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ వైరస్ మళ్లీ వేగంగా విస్తరిస్తోంది. కొత్తగా వెలుగు చూస్తున్న వేరియంట్లు ఎక్కువగా సోకుతున్నాయని అధికారులు తెలిపారు.

- Advertisement -

సింగపూర్‌లో కోవిడ్ కేసుల సంఖ్య మే మొదటి వారం నాటికి 14,200కి చేరుకుంది. ఇది గత వారం కంటే 28 శాతం ఎక్కువ. అలాగే ఆసుపత్రిలో చేరిన రోగుల సంఖ్యలో కూడా 30 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుతం NB.1.8, LF.7 అనే వేరియంట్లు వ్యాపిస్తున్నాయి. ఇవి ఇప్పటికే పరిచయమైన JN.1 వేరియంట్‌కు సంబంధించి భిన్నరూపాలుగా గుర్తించారు. హాంకాంగ్ పరిస్థితి కూడా పెద్దగా భిన్నంగా లేదు. అక్కడ శ్వాసకోశ నమూనాల పాజిటివిటీ రేటు ఇటీవల నాలుగు వారాల్లోనే 6.21 శాతం నుంచి 13.66 శాతానికి పెరిగింది. మే మొదటి వారంలో ఒక్క హాంకాంగ్‌లోనే కరోనా కారణంగా 31 మంది మరణించినట్టు అక్కడి ఆరోగ్య కేంద్రం పేర్కొంది.

ఈ నేపథ్యంలో భారతదేశంలో పరిస్థితి ఎలా ఉండబోతోందని చూసిన ఆరోగ్య నిపుణులు, వైరాలజిస్టులు కొంత భరోసా కలిగించే మాటలు చెప్పారు. ఇప్పటికే దేశంలో చాలా మంది కరోనా తర్వాత శరీర రోగనిరోధక శక్తిని పెంచుకున్నారు. అందువల్ల, భారత్‌లో తీవ్ర పరిస్థితులు నెలకొనే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు. అయితే పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ప్రజలు ముందుగానే మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఎక్కువ మంది ఉన్న ప్రదేశాల నుంచి దూరంగా ఉండడం వంటి జాగ్రత్తలు పాటిస్తే.. మళ్లీ వైరస్ విస్తరించకుండా అడ్డుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో కరోనా మళ్లీ కలకలం రేపుతున్న నేపథ్యంలో, వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడమే ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News