Sunday, July 13, 2025
Homeఇంటర్నేషనల్Cupola: ఈ కిటికీ నుంచి ప్రపంచం మొత్తం ఒకేసారి చూసేయొచ్చు!

Cupola: ఈ కిటికీ నుంచి ప్రపంచం మొత్తం ఒకేసారి చూసేయొచ్చు!

ISS Cupola: ఇంట్లో కిటికీ ద్వారా మనం వీధిని చూసే వరకు మాత్రమే పరిమితం అవుతాం. కానీ, అంతరిక్షంలో ఉన్న ఓ ప్రత్యేక కిటికీ మాత్రం వ్యోమగాములకు భూమి, విశ్వం అందాలూ చూపుతుంది. ఈ అద్భుత కిటికీకి పేరు “కుపోలా”. భూమికి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఈ విండో ఉంటుంది. ఇది వ్యోమగాములకు గాజు గదిలా ఉండే ఒక ప్రత్యేక స్థలం. అక్కడ నిలబడి వారు భూమిని, అంతరిక్షాన్ని తిలకించగలుగుతారు. ‘కుపోలా’ అనే పదం ఇటాలియన్‌ భాషలో ‘గుండు ఆకారపు గది’ అనే అర్థాన్ని ఇస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణం 1990లో ప్రారంభమైంది. ఇందులో భాగంగా ట్రాంక్విలిటీ మాడ్యూల్‌ 2010లో డిస్కవరీ స్పేస్ షటిల్ సహాయంతో ఐఎస్‌ఎస్‌కు చేరింది. అదే సమయంలో కుపోలా మాడ్యూల్‌ కూడా పంపించారు. ఇది ఏడు అద్దాల కిటికీలతో ఉంటుంది. మధ్యలో ఒక పెద్ద వృత్తాకార కిటికీ, చుట్టూ ఆరు చిన్న గాజు విండోలు ఉండేలా పుష్పాకార ఆకృతిలో రూపొందించబడింది.

- Advertisement -

వ్యాసం: 2.95 మీటర్లు
ఎత్తు: 1.5 మీటర్లు
బరువు: 1,880 కిలోగ్రాములు
వృత్తాకార అద్దపు విండో పరిమాణం: 80 సెంటీమీటర్లు
2025 ఫిబ్రవరిలో ఈ విండో ఐఎస్‌ఎస్‌కు అనుసంధానించి 15 ఏళ్లు పూర్తయ్యాయి.

మొదట నాసా, బోయింగ్ కలిసి ఈ మాడ్యూల్‌ను అభివృద్ధి చేయాలని భావించాయి. కానీ వ్యయ నియంత్రణ కారణంగా ఆ ప్రణాళికను విరమించాయి. తదనంతరం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) ఈ బాధ్యతను తీసుకుంది. ఇటలీకి చెందిన “ఎలినియా స్పాజియో” అనే సంస్థ దీనిని రూపొందించి, అభివృద్ధి చేసి, ఐఎస్‌ఎస్‌లో అనుసంధానించింది. అంతరిక్ష శకలాలు లేదా సూక్ష్మ ఉల్కల నుంచి ఈ విండోలను రక్షించేందుకు మారకపు షట్టర్లను అమర్చారు. ఇవి గాజుపై గీతలు పడకుండా, దెబ్బ తగలకుండా జాగ్రత్త తీసుకుంటాయి. అవసరమైనపుడు మాత్రమే వ్యోమగాములు వీటిని తెరిచి అంతరిక్షాన్ని పరిశీలించగలుగుతారు. ఈ విండో ద్వారానే స్పేస్‌ స్టేషన్‌ బయట భాగాల్లో జరుగుతున్న కార్యకలాపాలు, రోబోటిక్ కదలికలు చూసేందుకు వీలవుతుంది. అంతేకాదు, విశ్రాంతి సమయంలో వ్యోమగాములు ఇక్కడికి వచ్చి భూమిని, నక్షత్రాలను వీక్షిస్తూ మానసిక ప్రశాంతత పొందుతారు.

కుపోలా – భూమితో ఉన్న ఎమోషనల్ కనెక్షన్

కుపోలా గురించి ప్రాజెక్టు మేనేజర్ డోరియాన బఫ్‌ స్పందిస్తూ, ‘‘ఇది వ్యోమగాములను భూమితో మానసికంగా అనుసంధానించే తాడులాంటి వేదిక’’ అని పేర్కొన్నారు. తాజాగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా కుపోలాలో పలు ప్రయోగాలు నిర్వహించారు. ఆయన తిలకించిన దృశ్యాలు తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతరిక్షంలో ఉండే విశాలత, ప్రశాంతతను ఆయన ఫోటోలు ప్రతిబింబిస్తున్నాయి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News