Dalai Lama Longevity Aspiration: టిబెట్ బౌద్ధమత అత్యున్నత ఆధ్యాత్మిక గురువు, శాంతికి ప్రతీక, 14వ దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయి. ఆయన వారసుడి ఎంపిక ప్రక్రియపై ఇటీవల జరిగిన ప్రకటనలు సంచలనం సృష్టించగా, ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు అంతకు మించి ఆలోచింపజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రజలకు సేవ చేసేందుకు తాను మరో 30-40 ఏళ్లు జీవించాలని, ఏకంగా 130 సంవత్సరాలు పైగా ఉండాలని ఆకాంక్షించడం వెనుకనున్న అంతరార్థం ఏమిటి?
90వ పుట్టినరోజు వేడుకల్లో దలైలామా అద్భుత ప్రకటన:
శనివారం తన 90వ పుట్టినరోజుకు ఒక రోజు ముందు, దలైలామా చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానులను, ప్రపంచ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశాయి. “ప్రజా సేవ చేసేందుకు తాను ఇంకో 30-40 సంవత్సరాలు బతకాలని ఆశిస్తున్నట్లు” ఆయన ప్రకటించారు. తన అనుచరులు నిర్వహించిన దీర్ఘాయుష్షు ప్రార్థనల సమయంలో, తన మనసులో మాటను బయటపెడుతూ, తనకు అవలోకితేశ్వరుడి కృప ఆశీస్సులు ఉన్నాయని, అందుకు స్పష్టమైన సంకేతాలు, సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. “అనేక ప్రవచనాలను పరిశీలిస్తే, నాకు అవలోకితేశ్వరుడి కృప, ఆశీస్సులు ఉన్నాయని భావిస్తున్నాను. ఇప్పటి వరకు నా వంతు కృషి నేను చేశాను. ఇంకా నేను 30-40 ఏళ్లు జీవించాలని ఆశిస్తున్నాను. మీ ప్రార్థనలు ఇప్పటి వరకు ఫలించాయి. నా బాల్యం నుంచి అవలోకితేశ్వరుడికి నాకు బలమైన సంబంధం ఉందని మనసు చెప్తోంది. ఇప్పటి వరకు నేను టిబెట్ ప్రజలకోసం, బుద్ధ ధర్మం కోసం సేవ చేయగలిగాను . ఇంకా 130 సంవత్సరాలకు పైగా జీవించాలని ఆశిస్తున్నాను” అని దలైలామా ఉద్ఘాటించారు.
ప్రవాస టిబెటన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వేడుకలు:
దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలను , ప్రవాస టిబెటన్ ప్రభుత్వం వారం రోజులపాటు ఘనంగా నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ వేడుకల్లో భాగంగా, ధర్మశాలలోని ప్రధాన ఆలయంలో నిర్వహించిన దీర్ఘాయుష్షు ప్రార్థనా కార్యక్రమంలో 15 వేల మందికి పైగా హాజరయ్యారు. వీరిలో భక్తులు, టిబెటన్ బౌద్ధమత ప్రతినిధులు, వివిధ మఠాల సీనియర్ లామాలు పాల్గొన్నారు. ఈ భారీ జన సందోహం దలైలామా పట్ల ప్రజలకున్న అపారమైన భక్తిని, ప్రేమను ప్రతిబింబిస్తుంది.
భారతదేశంలో ఆశ్రయం – చైనాపై దలైలామా విశ్లేషణ:
దలైలామా తన స్వదేశాన్ని కోల్పోయి భారతదేశంలో ప్రవాస జీవితం గడుపుతున్నప్పటికీ, టిబెట్‌లోని ప్రజల కోసం తాను ఎంతగానో కృషి చేయగలిగానని పేర్కొన్నారు. చైనా నాయకుడు మావో జెడాంగ్‌ను అతను కలుసుకున్న విషయాన్ని దలైలామా ఆ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. “మావో జెడాంగ్ ‘మతం ఒక విషం’ అని వ్యాఖ్యానించారు. కానీ నేను దానికి ప్రతిస్పందించలేదు. అతను మంచిని చెడుగా చూశాడు. జెడాంగ్‌పై నాకు కరుణ కలిగింది” అని దలైలామా అన్నారు.
మానవ స్వభావం, ఆనందంపై దలైలామా బోధనలు:
“బౌద్ధమత సాహిత్య గ్రంథాల ప్రకారం- ప్రజలు భిన్న మానసిక స్వభావాలు, భిన్న అభిరుచులు కలిగి ఉంటారు. అందరూ ఆనందం కోసం ప్రయత్నం చేస్తారు . మతంపై విశ్వాసం లేనివారు కూడా ఆనందాన్ని పొందడానికి, బాధల నుంచి విముక్తి పొందడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి, ఈ భూమిపై ఉన్న వారందరూ, ఆఖరికి టిబెటన్లు కూడా బాధలను ఇష్టపడరు. వాస్తవానికి మనమందరం ఆనందాన్ని కోరుకుంటాం. ఈ కోణంలో చూస్తే మనమందరం ఒక్కటే. కావునా మనం ఎవరి పద్ధతుల్లో వాళ్లం బాధలు తగ్గించుకుని, ఆనందం పొందాలి” అని దలైలామా పేర్కొన్నారు.
వారసుడి ఎంపికపై స్పష్టత – చైనాకు దీటైన జవాబు:
దలైలామా తన వారసుడి ఎంపిక విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. గాడెన్ ఫోడ్రోంగ్ ట్రస్ట్‌కు తన మరణానంతరం మాత్రమే వారసుడి ఎంపిక బాధ్యతను అప్పగించారు. భారతదేశం కూడా దలైలామాకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అయితే, చైనా మాత్రం దలైలామా వారసుడి ఎంపికకు తమ ఆమోదం అవసరమని మొండివాదన చేస్తోంది. దీనిపై సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్షుడు పెన్పా త్సెరింగ్, చైనాకు అలాంటి అధికారం ఏదీ లేదని స్పష్టం చేశారు. ఈ వివాదం దలైలామా వారసత్వంపై అంతర్జాతీయ రాజకీయాలకు అద్దం పడుతోంది.