Sunday, July 13, 2025
Homeఇంటర్నేషనల్Dalai Lama Succession : దలైలామా వారసత్వంపై భారత్ అల్టిమేటం!

Dalai Lama Succession : దలైలామా వారసత్వంపై భారత్ అల్టిమేటం!

Dalai Lama’s Final Decision on Succession: దలైలామా పునర్జన్మ అంశం ఇప్పుడు భారత్, చైనా మధ్య సరికొత్త వివాదానికి తెర తీసింది. కేంద్ర మైనారిటీల శాఖ మంత్రి కిరణ్ రిజిజు దలైలామా నిర్ణయాన్ని గట్టిగా సమర్థించగా, చైనా మాత్రం తన ఆమోదం తప్పనిసరి అని పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ పరిణామాలు రెండు దేశాల సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి, అసలు ఈ వివాదానికి మూలం ఏంటి అనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

దలైలామా పునర్జన్మ వివాదం: ఎందుకు తెరపైకి వచ్చింది : టిబెటన్ బౌద్ధుల అత్యున్నత ఆధ్యాత్మిక గురువు, దలైలామా పునర్జన్మ అంశం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ వివాదానికి మూలం దలైలామా స్వయంగా జూలై 2, 2025న ధర్మశాల నుంచి విడుదల చేసిన ఒక వీడియో సందేశం. ఈ సందేశంలో, దలైలామా తన పునర్జన్మ ప్రక్రియపై అద్భుతమైన స్పష్టతనిచ్చారు.

“దలైలామా సంస్థ నిరంతరం కొనసాగుతుంది. నా భవిష్యత్ పునర్జన్మను గుర్తించే ఏకైక అధికారం ‘గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్’కి మాత్రమే ఉంటుంది. ఈ విషయంలో ఇతరులెవ్వరూ జోక్యం చేసుకోడానికి వీల్లేదు,” అని ఆయన కుండబద్దలు కొట్టారు. 1959 నుంచి భారత్‌లోని ధర్మశాలలో శరణార్థిగా నివసిస్తున్న దలైలామా చేసిన ఈ ప్రకటన అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది.

దలైలామా వారసత్వంపై చైనా పట్టు: ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక గురువుగా పూజలందుకుంటున్న దలైలామా అంటే చైనాకు ఏమాత్రం గిట్టదు. టిబెట్‌ను తమ దేశం నుంచి విడగొట్టాలని చూసే వ్యక్తిగా ఆయనను భావిస్తుంటుంది. ఇప్పుడు ఆయన 90వ పుట్టినరోజు సమీపిస్తున్న వేళ, ఆయన తర్వాత ఎవరు దలైలామా అవుతారనే విషయంలో చైనా తన ఆధిపత్యాన్ని చెలాయించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ఈ విషయంలో భారత్‌లోని చైనా రాయబారి జు ఫెయిహాంగ్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. ఆయన సోషల్ మీడియాలో ఏమన్నారంటే.. “దలైలామా తర్వాత పునర్జన్మ పొందే వ్యక్తిని ‘గోల్డెన్ అర్ణ్’ అనే లాటరీ పద్ధతి ద్వారానే ఎంపిక చేయాలి. అంతేకాదు, దీనికి చైనా ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి.” అని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఉన్న దలైలామా విషయంలో ఈ లాటరీ పద్ధతి నుంచి మినహాయింపు ఇచ్చినా, రాబోయే దలైలామా మాత్రం కచ్చితంగా చైనా చట్టాలకు, నిబంధనలకు లోబడే ఉండాలని జు ఫెయిహాంగ్ స్పష్టం చేశారు. 

- Advertisement -

రిజిజు సంచలన వ్యాఖ్యలు: దలైలామా పునర్జన్మ వివాదంపై కేంద్ర మైనారిటీల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలు భారత వైఖరిలో కీలక మలుపును సూచిస్తున్నాయి. సాధారణంగా ఈ విషయంలో దశాబ్దాలుగా మౌనంగా ఉన్న భారత్, ఇప్పుడు దలైలామాకు పూర్తిస్థాయి మద్దతును ప్రకటించింది.

గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన కిరణ్ రిజిజు, “దలైలామా బౌద్ధులకు అత్యంత ముఖ్యమైన సంస్థ. ఆయన కోరికలు, సంప్రదాయాల ప్రకారమే ఆయన పునర్జన్మ నిర్ణయం జరగాలి. ఈ విషయంలో మరెవరికీ జోక్యం చేసుకునే అధికారం లేదు” అని స్పష్టం చేశారు. రిజిజు ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా దలైలామా వారసత్వంపై చైనా జోక్యాన్ని భారత్ అంగీకరించబోదని పరోక్షంగా తేల్చిచెప్పారు.

ఆసక్తికరమైన విషయమేమిటంటే, రిజిజుతో పాటు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కూడా జూలై 6న ధర్మశాలలో జరగనున్న దలైలామా 90వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొననున్నారు. కేంద్ర మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొనడం కొత్త కానప్పటికీ, పునర్జన్మ అంశంపై రిజిజు ఇంత స్పష్టమైన ప్రకటన చేయడం ఇదే తొలిసారి. ఇది చైనాకు గట్టి సందేశం పంపినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

భారత్ వైఖరిలో కీలక మలుపు:  దశాబ్దాలపాటు దలైలామాకు ఆశ్రయం కల్పించిన భారత్, ఆయన వారసత్వ విషయంలో ఇంతకాలం మౌనాన్ని వహించింది. అయితే, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన తాజా వ్యాఖ్యలతో ఈ విషయంలో భారత్ తన వైఖరిని మార్చుకుందని స్పష్టమవుతోంది. ఇది చైనాకు గట్టి సందేశం పంపడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దలైలామా వారసత్వంపై చైనా జోక్యాన్ని భారత్ ఎన్నడూ అంగీకరించలేదని, మాజీ విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే 2024 నివేదికలోనూ స్పష్టం చేశారు. చైనా నియమించిన మత పెద్దలను భారత్ అంగీకరించడానికి ఆసక్తి చూపలేదని ఆయన ఆ నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం, కిరణ్ రిజిజు వ్యాఖ్యలు దలైలామాకు మద్దతుగా భారత్ ఒక వ్యూహాత్మక అడుగు వేసినట్లుగా కనిపిస్తోంది.

ఈ వివాదం భారత-చైనా సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. టిబెటన్ బౌద్ధమత స్వాతంత్ర్యాన్ని పరిరక్షించడంలో భారత్ పాత్ర భవిష్యత్తులో మరింత కీలకం కానుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News