Dark Dining Restaurants: రెస్టారెంట్‌లో మనం ఆర్డర్ చేసిన ఫుడ్‌ను కళ్లతో ఆస్వాదిస్తూ నోటితో వాటి రుచిని అనుభూతి చెందుతాం. అయితే ఓ సారి ఆలోచించండి కళ్లకు గంతలు కట్టుకుని భోజనం చేస్తే ఎలా ఉంటుంది అనేది. మీరు ఏం తింటున్నారు అనేది మీ కళ్లు కాకుండా మీ నాలుక ముందుగా గ్రహిస్తూ తింటుంటే ఆ ఫీలింగ్ వేరు కదా.. దీనినే డార్క్ డైనింగ్ అంటారు. ఇలాంటి డార్క్ డైనింగ్స్ ఎక్కడ ఉన్నాయి.. వాటి ప్రత్యేకత ఏంటి ఈ కథనంలో తెలుసుకుందాం..
సోషల్ మీడియా యుగంలో ఇప్పుడు ప్రతి విషయాన్ని ఇన్‌స్టాలో షేర్ చేయడం ట్రెండింగ్‌గా మారింది. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు పక్కనే ఫ్రెండ్స్ లేదా పార్ట్‌నర్ ఆకలితో ఉంటూ ఫుడ్ తినాలని ఎదురుచూస్తుంటే.. మరోవైపు చాలామంది రీల్స్ లవర్స్.. ఫుడ్‌తో సరైన సెల్ఫీ వచ్చేవరకూ ప్లేట్‌లో చేయి కూడా పెట్టనివ్వరు. కానీ మీకు వచ్చిన ఆర్డర్ ఏంటో చూడకుండా తినమంటే ఎలా ఉంటుంది.
ఫుడ్ వెరైటీల పట్ల ఆసక్తి ఉన్న ఓ రచయిత క్రిష్ అశోక్ ఇటీవల.. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లోని బ్లిండెకుహ్ అనే రెస్టారెంట్‌లో తనకు ఎదురైన ఆసక్తికరమైన డార్క్ డైనింగ్ అనుభవాన్ని పంచుకున్నారు. అక్కడ తాను కళ్ళకు గంతలు కట్టుకుని మనస్ఫూర్తిగా భోజనాన్ని ఆస్వాదించినట్లు తెలిపారు.
మొదటగా డార్క్ డైనింగ్ 1997లో పారిస్‌లో ‘లే గాట్ డు నోయిర్ ‘ పేరిట ప్రారంభమైంది. డార్క్ డైనింగ్ రీసెంట్ ట్రెండింగ్ అనుకుంటే పొరపాటే.. 30 ఏళ్ల కిందటే మొట్టమొదటగా పారిస్‌లో ప్రారంభం కాగా.. తర్వాత జ్యూరిచ్‌లో పర్మినెంట్ బ్లైండ్ డైనింగ్ రెస్టారెంట్ నెలకొంది. అవగాహన, గ్యాస్ట్రోనమీ ఉద్దేశంగా ఈ బ్లైండ్ డైనింగ్ రెస్టారెంట్ పనిచేస్తుంది. కళ్లకు గంతలు కట్టుకుని ఉండగా ఏమీ కనిపించని కటిక చీకటిలో ఆహారాన్ని ఆస్వాదించడమే వీటి ఉద్దేశం. ఇలా భోజనం చేయడం ద్వారా మీ ఇంద్రియాల పనితీరును కూడా మెరుగుపరుస్తుందట..
కళ్లకు గంతలు కట్టుకుని భోజనం చేసేటప్పుడు.. ఫుడ్ వాసనను పసిగట్టడంలో మీ ముక్కు పోషించే కీలక పాత్రను తెలుసుకుంటారు. భోజనం రుచి, ఆకృతి, తయారీలో ఉపయోగించే ప్రతి పదార్థంపై దృష్టి పెట్టవచ్చట. ఈ సమయంలో మీరు ఫోన్ కూడా ఉపయోగించకూడదు. అంతేకాదు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం లేదా.. రిసెప్షన్‌లో ఉంచాల్సి వస్తుందట.
అయితే మీరు రెస్టారెంట్‌కి వెళ్లాక టేబుల్ దగ్గర కూర్చున్నాక భోజనం ఆర్డర్ చేయొచ్చు అనుకుంటే పొరపాటే.. మీరు రిసెప్షన్‌లోనే భోజనం ముందుగా ఆర్డర్ చేయాలి. ఆ తర్వాత అక్కడి నుంచి సిబ్బంది మిమ్మల్ని కళ్లకు గంతలు కట్టుకుని తీసుకెళ్తారు. టేబుల్‌పై గ్లాసులు, చాకులు, స్పూన్లు ఎక్కడ ఉన్నాయో మీ చేతులతో స్పృశిస్తూ తెలియజేస్తారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కొన్ని డార్క్ డైనింగ్ రెస్టారెంట్లలో దృష్టి లోపం ఉన్న సర్వర్లు సేవలు అందిస్తారట.
ఈ రెస్టారెంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే
యూరప్‌లో, స్విట్జర్లాండ్‌కు చెందిన బ్లిండెకుహ్ బ్లైండ్ రెస్టారెంట్ ఇప్పటికీ ఆదరణ పొందుతోంది. పారిస్, లండన్, బెర్లిన్, ఆమ్‌స్టర్‌డామ్‌లతో పాటు సింగపూర్‌లో NOX, హోచిమిన్ సిటీలో నోయిర్ డార్క్ డైనింగ్ అనుభవాన్ని అందిస్తున్నాయి. భారత్‌లోనూ సాక్షమ్ ట్రస్ట్ అనే NGO గతంలో ‘నైట్ ఆఫ్ ది సెన్సెస్’ నిర్వహించింది. కెనడాలో కూడా డార్క్ టేబుల్, ఓ.నోయిర్, సిడ్నీలో “డైనింగ్ ఇన్ ది డార్క్” ఈవెంట్‌లతో ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తున్నాయి.
చాలా మంది భోజన ప్రియులు.. వివిధ రకాల వెరైటీలను ఆస్వాదించేందుకు ప్రపంచ యాత్రలు సైతం చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ డార్క్ డైనింగ్ అనుభూతి మంచి కిక్ ఇస్తుంది. ఓ సారి ట్రై చేయండి మరి.


