Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Nepal Protests: నేపాల్‌లో ప్రజాస్వామ్యం అంతం కానుందా?.. రెండేళ్ల క్రితమే జోస్యం చెప్పిన డెవిల్‌! 

Nepal Protests: నేపాల్‌లో ప్రజాస్వామ్యం అంతం కానుందా?.. రెండేళ్ల క్రితమే జోస్యం చెప్పిన డెవిల్‌! 

Devil Astrologer On Nepal Politics: నేపాల్‌లో సోషల్‌ మీడియాపై నిషేధం.. జెన్‌- జెడ్ ఉద్యమానికి దారి తీసింది. తీవ్ర ఆందోళనల నేపథ్యంలో ప్రధాని కె.పి. శర్మ ఓలి, మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో నేపాల్‌ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్‌ ఘీసింగ్‌ను బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో డెవిల్ జోతిష్కుడుగా పేరుగాంచిన ప్రశాంత్ కినీ పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

- Advertisement -

ప్రజాస్వామ్యం అంతం.. రాబోయేది రాచరికం

ప్రస్తుతం చెలరేగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, పరిణామాల నేపథ్యంలో నేపాల్‌లో ప్రజాస్వామ్యం అంతం అవుతుందనే ఓ వార్త వైరల్ అవుతోంది. ప్రశాంత్ కినీ అనే జ్యోతిష్కుడు ‘X’(ట్విట్టర్‌) వేదికగా నేపాల్ రాజకీయాలపై అంచనా వేస్తూ 2023, Dec 16న ఓ ట్వీట్‌ చేశారు. ‘నేపాల్‌లో ప్రజాస్వామ్యం అంతమయ్యే సమయం దగ్గర్లో ఉంది. 2025 లో నేపాల్‌లో రాచరికం తిరిగి వస్తుంది’. అని పోస్ట్‌ చేశారు. 

జ్యోతిష్కుడు ప్రశాంత్ కినీ ‘X’ బయోడేటా ప్రకారం.. ఆయన మార్చి 2023లో ‘X’ లో చేరారు. తాను రాజకీయాలను అంచనా వేస్తానని, అరచేతులను చూసి వారి భవిష్యత్ చెప్పగలనని, తాను టారో రీడర్ కూడా అని తెలిపారు. అయితే నేపాల్‌లో తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రెండేళ్ల క్రితం ప్రశాంత్‌ కినీ చేసిన పోస్ట్‌.. ఇప్పుడు వైరల్‌ అవుతోంది. 

కాగా, అంతకుముందే అక్టోబర్ 2023లో ప్రశాంత్.. ఖతార్‌ పరిస్థితులపై అంచనా వేస్తూ ఓ ట్వీట్‌ చేశారు. “జూన్ 2025 నుంచి జూలై 2026 మధ్య ఖతార్ పాలక వర్గం తీవ్ర ఇబ్బందుల్లో పడనుంది. 2028- 29 సంవత్సరంలో ఖతార్ భారీ విధ్వంసం చవిచూడనుంది. ఆర్థిక మాంద్యం, భారీ అగ్ని ప్రమాదం, ఉగ్రవాద దాడి సంభవించనుంది.” అని పోస్ట్‌లో పేర్కొన్నారు. సెప్టెంబర్ 9న ఈ పోస్ట్‌ని రీ పోస్ట్ చేస్తూ, “ఇజ్రాయెల్ ఈరోజు ఖతార్‌పై దాడి చేసింది.” అని ప్రశాంత్‌ కినీ రాశారు. 

నేపాల్‌లో గత వారం రోజులుగా జరుగుతున్న అల్లర్లు దేశ రాజకీయాలను మార్చేశాయి. ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై (యూట్యూబ్‌తో సహా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్) నిషేధం విధించడంతో యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది. ఈ నిషేధాన్ని ప్రభుత్వం ‘నకిలీ వార్తలు, హేట్ స్పీచ్‌ను అరికట్టడానికి’ అని సమాధానం చెప్పినా.. యువత దీన్ని వ్యతిరేకతను అణచివేసే ప్రయత్నంగా భావించింది. 

కాఠ్మాండూలో పార్లమెంట్‌ చుట్టూ వేలాది మంది యువకులు సమావేశమయ్యారు. దీంతో అక్కడ అల్లర్లు చెలరేగాయి. పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బులెట్లు, లైవ్ ఫైరింగ్‌తో ప్రతిస్పందించడంతో 19 మంది మృతి చెందారు. 400 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ‘జెన్ Z’ ఆందోళనలు కేవలం సోషల్ మీడియా నిషేధంపై మాత్రమే కాదు. దేశంలోని అవినీతి, నిరుద్యోగం, రాజకీయ కుటుంబాల ఆడంబరాలపై కూడా విజృంభించాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad