Donald Trump Action on Serians: అక్రమ వలసదారులపై గట్టి చర్యలు తీసుకుంటున్న అమెరికా ప్రభుత్వం, సిరియా వలసదారుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సిరియన్లకు ఇప్పటివరకు అందిస్తున్న తాత్కాలిక రక్షణ హోదా (టీపీఎస్)ను రద్దు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ హోదా కింద అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది సిరియన్లు 60 రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. దేశం విడిచి వెళ్లని పక్షంలో అరెస్టు చేసి, బలవంతంగా డిపోర్ట్ చేస్తామని హెచ్చరించింది. టీపీఎస్ కింద 2012 నుంచి ఇప్పటివరకు దాదాపు 6,000 మందికిపైగా సిరియన్లు అమెరికాలో ఉన్నారని అంచనా. ఈ హోదా వారికి పని చేసే అనుమతులు కల్పించడం, బహిష్కరణ నుంచి రక్షణ కల్పించడం వంటి సౌకర్యాలను కల్పిస్తోంది. అయితే, ఇప్పుడు ఆ రక్షణను నిలిపివేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ నిర్ణయించింది. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అధికార ప్రతినిధి ట్రిసియా మెక్లాఫ్లిన్ ఈ నిర్ణయంపై మాట్లాడుతూ, “ప్రస్తుత పరిస్థితుల్లో తాత్కాలిక రక్షణ హోదా కింద అమెరికాలో నివసిస్తోన్న సిరియా ప్రజలు వారి స్వదేశానికి వెళ్లక తప్పదు. వెళ్లని పక్షంలో వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాం.” అని ఘాటుగా స్పందించారు. అదే సమయంలో, దశాబ్దాలుగా ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా సిరియా పనిచేస్తోందని, తమ దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆ దేశ వలసదారులకు ఇకపై ఆశ్రయం ఇవ్వలేమని ఆయన స్పష్టం చేశారు. 60 రోజుల గడువు ముగిసేలోపు స్వదేశానికి తిరిగి వెళ్లని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అమెరికా అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఇప్పటికే అమెరికాలో స్థిరపడి నివసిస్తున్న వేలాది మంది సిరియన్లకు పెద్ద దెబ్బ అనే చెప్పవచ్చు.
6 వేలకు పైగా సిరియన్లపై ఎఫెక్ట్..
కాగా, 2012 నుండి సిరియా నుండి వచ్చిన వేలాది మంది సిరియన్లు తాత్కాలిక రక్షణ హోదా కింద అమెరికాలో నివసిస్తున్నారు. వీరి సంఖ్య 6 వేలకు పైగా ఉంటుందని అంచనా. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అమెరికా ఫస్ట్ పేరుతో కఠినమైన నిబంధనలు తీసుకొస్తున్నారు. విదేశీ ఉద్యోగుల వల్ల అమెరికన్లకు ఉద్యోగాలు సన్నగిల్లుతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా, హెచ్1బీ వీసా ఫీజులు భారీగా పెంచి అక్కడి విదేశీ ఉద్యోగులు, కంపెనీలకు షాకిచ్చారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్ణయం వల్ల ఎక్కువ మంది భారతీయులే నష్టపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


