Homeఇంటర్నేషనల్Trump : ‘మాకు కెనడా నుంచి ఏమీ వద్దు'.. సుంకాల వివాదంపై ట్రంప్ సంచలన...

Trump : ‘మాకు కెనడా నుంచి ఏమీ వద్దు’.. సుంకాల వివాదంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్‌ ( తెలుగు ప్రభ ) : అమెరికా–కెనడా మధ్య వాణిజ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలకు కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ సహా ఆ దేశ నేతలు దీటుగా స్పందిస్తుండటంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ మరోసారి కెనడాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కెనడా నుంచి అమెరికాకు ఎలాంటి వస్తువుల అవసరం లేదని వ్యాఖ్యానించారు. అమెరికా విధిస్తున్న సుంకాల నుంచి తప్పించుకోవాలంటే కెనడాలోని కంపెనీలన్నీ తమ కార్యకలాపాలను అమెరికాకు తరలించుకోవాలని సూచించారు. కెనడా దశాబ్దాలుగా అమెరికాను దారుణంగా దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఈ మేరకు తన ‘ట్రూత్‌ సోషల్‌’ ఖాతాలో వరుస పోస్టులు చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన సమయంలో డెట్రాయిట్‌లోని కీలక ఫ్యాక్టరీని మూసివేయాలని ఫోర్డ్‌ సంస్థ భావించిందని ట్రంప్‌ పేర్కొన్నారు. అయితే, ఎన్నికల్లో తాను ఆధిక్యంలోకి వస్తే పరిస్థితులు ఎలా మారతాయో వేచి చూడాలని ఆ సంస్థ నిర్ణయించిందన్నారు. ప్రస్తుతం ఆ ఫ్యాక్టరీ నిరంతరాయంగా పనిచేస్తూ భారీ లాభాలను ఆర్జిస్తోందని తెలిపారు. జనరల్‌ మోటార్స్‌తో పాటు ఇతర కంపెనీల విషయంలోనూ ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని చెప్పారు.

- Advertisement -

సుంకాలతో మారిన పరిస్థితులు : అమెరికా విధించిన సుంకాల కారణంగానే కంపెనీల పరిస్థితిలో ఈ మార్పు వచ్చిందని ట్రంప్‌ పేర్కొన్నారు. ‘‘మనకు కెనడియన్‌ కార్లు, పరికరాలు సహా ఏమీ అవసరం లేదు. కెనడాతో వాణిజ్యంలో అమెరికా ఏటా 60 బిలియన్‌ డాలర్లకుపైగా నష్టపోతోంది. ఇది దాదాపు రూ.5.7 లక్షల కోట్లకు సమానం. దశాబ్దాలుగా ఈ దోపిడీ కొనసాగుతోంది’’ అని ఆరోపించారు. గతంలో అమెరికా నుంచి తరలిపోయిన వ్యాపారాలు ఇప్పుడు సుంకాల నుంచి తప్పించుకునేందుకు తిరిగి దేశానికి వస్తున్నాయని ట్రంప్‌ అన్నారు. కెనడా విషయంలో కఠిన వైఖరి అవలంబించడంలో గత అమెరికా ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.

చివరి నిమిషంలో వాణిజ్య ఒప్పందం రద్దు : మరోవైపు అమెరికా–కెనడా మధ్య కుదరాల్సిన వాణిజ్య ఒప్పందం చివరి నిమిషంలో రద్దయింది. ఇప్పటికే కెనడాపై అమెరికా భారీగా సుంకాలు విధించగా.. తాజాగా కెనడా కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించింది. కెనడా నుంచి దిగుమతి చేసుకునే కార్లు, ట్రక్కులు, ఆటోమోటివ్‌ విడిభాగాలు, ఉక్కుపై ట్రంప్‌ ప్రభుత్వం 50 శాతం వరకు టారిఫ్‌లు విధించింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News