Donald Trump Comments on his son wedding: పశ్చిమాసియాలో యుద్ధం, ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహం గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇరాన్ సంక్షోభంలో బిజీగా ఉండటం వల్ల తన సొంత కుమారుడి పెళ్లికి వెళ్లేందుకు కూడా సమయం దొరకడం లేదని గురువారం వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. ఒకవేళ, ఆ వేడుకకు హాజరైనా.. హాజరుకాకపోయినా తప్పుడు వార్తలతో తనను చంపేస్తారని చమత్కరించారు. అందుకే వివాహానికి హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని.. అయితే, ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు, భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో అది కష్టంగా మారే అవకాశం ఉందని తెలిపారు. “ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవు. పెళ్లికి హాజరవడానికి శతవిధాలా ప్రయత్నిస్తా. అయితే, ఇరాన్ ప్రస్తుత పరిస్థితులు, మీడియా నిరంతర నిఘా కారణంగా ఈ సమయంలో పెళ్లికి అటెండ్ అవ్వడం చాలా కష్టం.” అని ట్రంప్ వివరించారు. కాగా, ఈ వారాంతంలో పామ్ బీచ్‌కు చెందిన ప్రముఖ సోషలైట్ బెట్టీనా ఆండర్సన్‌తో డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహం జరగనుంది.
Also read: Nara Lokesh: ఉపాధి కల్పన మా బ్రాండు.. గొడ్డలి జగన్ బ్రాండు.. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
అత్యంత సన్నిహితుల మధ్య వివాహం..
48 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఈ వారాంతంలో తన ప్రియురాలు బెట్టినా ఆండర్సన్‌ను వివాహం చేసుకోనున్నారు. ఈ వేడుక బహమాస్‌లో జరగనుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ వివాహానికి సన్నిహితులను మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ట్రంప్ జూనియర్ 2005లో వెనెసాను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరి మధ్య విభేదాలు రావడంతో 13 ఏళ్ల తమ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ 2018లో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఐదుగురు సంతానం. 2020లో ట్రంప్ జూనియర్‌కు ఫాక్స్‌న్యూస్ మాజీ హోస్ట్ కింబర్లీతో నిశ్చితార్థం జరగ్గా.. ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం కారణంగా తర్వాత దాన్ని రద్దు చేసుకున్నారు. అనంతరం ప్రముఖ మోడల్, సామాజికవేత్త బెట్టినా ఆండర్సన్‌తో ట్రంప్ జూనియర్ గతేడాది ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. త్వరలోనే వీరి వివాహం జరగనుంది.

