Saturday, November 15, 2025
HomeTop StoriesDonald Trump : "భారత్‌ గొప్ప దేశం": పాక్ ప్రధాని ముందే ట్రంప్ వ్యాఖ్యలు.....

Donald Trump : “భారత్‌ గొప్ప దేశం”: పాక్ ప్రధాని ముందే ట్రంప్ వ్యాఖ్యలు.. ఏం అన్నారంటే?

Donald Trump India-Pakistan mediation claim : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో చేసే వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తుంటాయి. తాజాగా మరోసారి ఆయన భారత్-పాకిస్థాన్‌ల మధ్య వైరం గురించి మాట్లాడుతూ, తానే వారి మధ్య యుద్ధాన్ని ఆపానని పునరుద్ఘాటించారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతూ, నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశామని ప్రకటించారు. అసలు ట్రంప్ ఏమన్నారు? పాక్ ప్రధాని ఎందుకంతగా పొగిడారు..? ట్రంప్ చేస్తున్న వాదనలో నిజమెంత..? దశాబ్దాల వైరాన్ని కేవలం 24 గంటల్లో సుంకాలతో పరిష్కరించానని చెప్పడం వెనుక ఉన్న మతలబు ఏంటి..?

- Advertisement -

గాజా శాంతి ఒప్పందం సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్థాన్ సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఒక గొప్ప దేశమని, అక్కడ అత్యున్నత స్థాయిలో తనకు ఒక మంచి స్నేహితుడు (ప్రధాని మోదీని ఉద్దేశించి) ఉన్నారని కొనియాడారు. ఆయన తన బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. తన వెనుకే ఉన్న పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను చూస్తూ, “భారత్, పాకిస్థాన్‌లు కలిసి చక్కగా జీవిస్తున్నాయని నేను భావిస్తున్నా” అని వ్యాఖ్యానించగా, షరీఫ్ నవ్వుతూ కనిపించారు.

పొగడ్తలతో ముంచెత్తిన పాక్ ప్రధాని : ఈ సందర్భంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, ట్రంప్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. “ఇది చరిత్రలో ఒక గొప్ప రోజు. అధ్యక్షుడు ట్రంప్ చొరవ వల్లే గాజాలో శాంతి నెలకొంది. అంతకుముందు భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన ఘర్షణను ఆపింది కూడా ఆయనే. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధాన్ని నివారించి, కాల్పుల విరమణ సాధించడానికి ట్రంప్ విశ్వప్రయత్నాలు చేశారు. ఆ నాలుగు రోజుల్లో ట్రంప్, ఆయన బృందం జోక్యం చేసుకోకపోతే, ఆ ఘర్షణలు యావత్ పశ్చిమాసియాకు విస్తరించి, ఏం జరిగిందో చెప్పడానికి కూడా ఎవరూ మిగిలేవారు కాదు. అందుకే నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్‌ను పాకిస్థాన్ నామినేట్ చేసింది. ఆయన ఏడు యుద్ధాలు ఆపారు, ఇది ఎనిమిదవది,” అంటూ ఆకాశానికెత్తేశారు.

24 గంటల్లో సుంకాలతో యుద్ధం ఆపానన్న ట్రంప్ : గతంలో పలుమార్లు చెప్పినట్లుగానే, భారత్-పాక్ యుద్ధాన్ని తాను కేవలం సుంకాలతోనే 24 గంటల్లో పరిష్కరించానని ట్రంప్ మరోసారి చెప్పుకొచ్చారు. “నేను కొన్ని యుద్ధాలను సుంకాల ఆధారంగానే పరిష్కరించాను. ఉదాహరణకు, భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధమే. వారిద్దరి దగ్గరా అణ్వాయుధాలున్నాయి. ‘మీరు యుద్ధం కొనసాగించాలనుకుంటే మీపై 100%, 150%, 200% భారీ సుంకాలు విధిస్తాను’ అని నేను చెప్పాను. అంతే, ఆ యుద్ధాన్ని 24 గంటల్లో పరిష్కరించాను. నా దగ్గర సుంకాలు లేకపోతే, మీరు ఆ యుద్ధాన్ని ఎప్పటికీ ఆపలేరు. నేను యుద్ధాలను పరిష్కరించడంలో నిష్ణాతుడిని,” అని ట్రంప్ తనను తాను కీర్తించుకున్నారు.

అయితే, భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక అంశాల్లో, ముఖ్యంగా కాల్పుల విరమణ వంటి విషయాల్లో మూడో వ్యక్తి ప్రమేయాన్ని భారత్ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటామని స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ, డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మార్చుకోకుండా పదేపదే అవే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad