Donald Trump new rules for universities: కొత్త రూల్స్‌తో విదేశీయులకు చెమటలు పట్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశీ విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చే విషయంలో కొత్త మెలిక పెట్టారు. అమెరికన్ వర్సిటీల్లో విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించే లక్ష్యంతో కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఈ మేరకు కొత్త నిబంధనల లేఖలు వైట్ హౌస్ నుంచి అమెరికాలోని ప్రముఖ విశ్వ విద్యాలయాలన్నిటికీ వెళ్లాయి. స్కాలర్‌షిప్‌ల రూపంలో అమెరికా ప్రభుత్వం నుంచి నిధులు కావాలంటే.. విదేశీ విద్యార్థుల అడ్మిషన్లను తగ్గించాలని వైట్ హౌస్ ఆయా యూనివర్సిటీలకు లేఖలు రాసింది. ఈ మేరకు వైట్‌హౌజ్ ప్రతిపాదించిన నిబంధనలు మెమో రూపంలో దేశంలోని టాప్ యూనివర్శిటీలకు పంపించింది. అమెరికా ప్రభుత్వం నుండి నిధులు కావాలంటే.. యూనివర్సిటీలన్నీ విదేశీ విద్యార్థులను కట్టడి చేయాలని, విద్యార్థుల అడ్మిషన్ సమయంలో కచ్చితంగా ప్రామాణిక పరీక్ష నిర్వహించాలని యూనివర్సిటీలను కోరింది. అలా చేస్తేనే ప్రభుత్వ నిధుల కేటాయింపులో ప్రాధాన్యం లభిస్తుందని వైట్‌హౌజ్ తెలిపింది. ఈ నిబంధనలను అంగీకరించిన యూనివర్సిటీలు ప్రభుత్వం నుంచి లబ్ధిని పొందవచ్చని ఆ లేఖలో వెల్లడించింది. వీటిల్లో విద్యార్థులకు ప్రభుత్వ రుణాలు, కాంట్రాక్టులు, రీసెర్చి నిధులు, గ్రాంట్లు, విదేశీ స్కాలర్స్‌కు వీసా అనుమతులు, ట్యాక్స్ కోడ్‌లో ప్రాధాన్యం వంటివి లభిస్తాయని స్పష్టం చేసింది. కాగా, అమెరికాలో ఉన్నత విద్యను పున: వ్యవస్థీకరించి, అమెరికన్ విద్యార్థులకు ప్రాధాన్యతనివ్వాలని డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గం భావిస్తోంది. ఈ మేరకు అమెరికాలోని ఎంఐటీ సహా ప్రముఖ విశ్వవిద్యాలయాలు మొత్తం ఈ లేఖలు అందుకున్నాయి.
యూనివర్సిటీలకు ట్రంప్ కొత్త షరతులు ఇవే..
1. విదేశీ వీసాలపై వచ్చే విద్యార్థుల సంఖ్య 15 శాతానికి మించి ఉండకూడదు. ఒకే దేశం నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య 5 శాతానికి మించకూడదు.
2. విదేశాల నుంచి అందే నిధుల వివరాలను ఖచ్చితంగా బహిర్గతం చేయాలి.
3. విద్యార్థుల అడ్మిషన్, ఫైనాన్షియల్ ఎయిడ్ సమయంలో జాతి, లింగ, జాతీయత, రాజకీయ భావజాలం, జెండర్ ఐడెంటిటీ, లైంగిక ఆకర్షణ, మతపరమైన అంశాలు పరిగణనలోకి తీసుకోకూడదు.
4. అండర్ గ్రాడ్యుయేట్ దరఖాస్తు దారులు కచ్చితంగా SAT లేదా ACT వంటి ప్రామాణిక పరీక్షను పూర్తి చేయాలి.
5. విద్యా స్వేచ్ఛను కాపాడే విధానాలను అమలు చేయాలి. దాడులకు పాల్పడే విద్యార్థులను కట్టడి చేయాలి.
6. విద్యాలయాలను ఇబ్బంది పెట్టేలా రాజకీయ ప్రదర్శనలు జరగకుండా చూడాలి. విద్యార్థులను లేదా విద్యార్థి సంఘాలను వేధించకుండా చర్యలు చేపట్టాలి.
7. ఉద్యోగులు అధికారిక విధులు నిర్వహించే సమయంలో విద్యార్థులను రాజకీయ ప్రసంగాలకు దూరంగా ఉంచాలి.
8. బాత్ రూమ్‌లు, లాకర్ రూమ్‌లు విద్యార్థుల లింగ ఆధారంగా వేర్వేరుగా ఉండాలి.
9. హార్డ్‌సైన్స్ విద్యను చదివే విద్యార్థులకు ఉచిత ట్యూషన్ ఫీజు, ప్రోత్సాహకం కింద 2 మిలియన్ డాలర్లు మించి ఇవ్వాలి.
10. ఈ నిబంధనలను ఆయా యూనివర్సిటీలు ఏ మేరకు అమలు చేస్తున్నాయనే విషయాన్ని జస్టిస్ డిపార్ట్‌మెంట్.. ఆయా యూనివర్సిటీ ఛాన్స్‌లర్లతోఎ సమీక్షించి ఎప్పటికప్పుడు తెలుసుకొంటుంది. వీటిని ఉల్లంఘిస్తే ప్రభుత్వ లబ్ధిని రెండేళ్ల పాటు ఆపేస్తారు.


