Donald Trump Nobel nomination deadline : అంతర్జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి, పలు దేశాల మధ్య శాంతికి కృషి చేశానని చెబుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిపై ఆశలు గల్లంతయ్యాయి. అనేక యుద్ధాలను ఆపిన ఘనత తనదేనని, ఈ అత్యున్నత పురస్కారానికి తానే అర్హుడినని బలంగా వాదిస్తున్నప్పటికీ, ఆయన పేరు కనీసం పరిశీలనకే నోచుకోలేదు. ఇంతటి బలమైన అభ్యర్థికి ఎందుకీ చుక్కెదురైంది..? తెరవెనుక ఏం జరిగింది..?
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి కోసం డొనాల్డ్ ట్రంప్ కొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన హయాంలో జరిగిన కొన్ని అంతర్జాతీయ ఒప్పందాలను చూపుతూ, ఎన్నో యుద్ధాలను ఆపిన ఘనత తనదేనని, ఈ అవార్డు తనకే ఇవ్వాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు.
పలు దేశాల నామినేషన్: ఈ క్రమంలో, పాకిస్థాన్, ఇజ్రాయెల్, కంబోడియా వంటి పలు దేశాలు 2025 నోబెల్ శాంతి బహుమతి కోసం డొనాల్డ్ ట్రంప్ పేరును ప్రతిపాదించాయి (నామినేట్ చేశాయి).
అడ్డం తిరిగిన గడువు : పలు దేశాలు నామినేట్ చేసినప్పటికీ, ట్రంప్‌కు ఈ ఏడాది నోబెల్ బహుమతి రావడం లేదని స్పష్టమైంది. దీనికి కారణం రాజకీయపరమైనది కాదు, కేవలం సాంకేతికపరమైనది.
ఫిబ్రవరి 1 డెడ్‌లైన్: నోబెల్ కమిటీ నిబంధనల ప్రకారం, ప్రతి ఏటా బహుమతికి సంబంధించిన నామినేషన్లను ఫిబ్రవరి 1వ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుంది.
అందని దరఖాస్తు: అయితే, డొనాల్డ్ ట్రంప్‌ను నామినేట్ చేస్తూ పంపిన దరఖాస్తు, నిర్దేశిత గడువులోగా నోబెల్ కమిటీకి చేరలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.
పరిశీలనకే నోచుకోని పేరు : నిబంధనల ప్రకారం, గడువు తేదీ తర్వాత వచ్చిన నామినేషన్లను నోబెల్ కమిటీ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోదు. ఈ కారణంగానే, 2025 సంవత్సరానికి గాను ప్రకటించనున్న నోబెల్ శాంతి బహుమతి పరిశీలన జాబితాలో డొనాల్డ్ ట్రంప్ పేరు లేదని తేలిపోయింది. దీంతో, ఆయనకు ఈ ఏడాది నోబెల్ బహుమతిపై ఆశలు పూర్తిగా ఆవిరైపోయాయి.


