Donald Trump: దక్షిణ కొరియా హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. అమెరికాలో విదేశీ ఉద్యోగులను నియమించుకోవచ్చని ‘X’ వేదికగా పోస్ట్ చేశారు. యూఎస్‌లో పట్టుబడులు పెట్టడానికి తమ దేశం వెనుకాడుతుందనే కొరియా హెచ్చరికల నేపథ్యంలో ట్రంప్ దెబ్బకు దిగొచ్చారు.
అమెరికా పరిశ్రమల్లో విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘X’ వేదికగా స్పష్టం చేశారు. కాగా, ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ దేశంలో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. అక్రమ వలసదారులను గుర్తించి, వెంటనే వారి దేశాలకు తిరిగి పంపే విధంగా నిబంధనలు అమలు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఇటీవల జార్జియాలోని ఓ ప్లాంట్ వద్ద 475 మంది అక్రమ వలసదారులను హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది. హ్యుందాయ్ కంపెనీ ప్లాంట్‌లో దక్షిణ కొరియా వాసులు అక్రమంగా పనిచేస్తున్నారని సమాచారం అందడంతో ఈ రైడ్ జరిగింది. అదుపులోకి తీసుకున్న వారిలో కొరియా వాసులే ఎక్కువగా ఉన్నారు. ఈ ఘటనతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది.
ఈ క్రమంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ స్పందించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలోకి తీసుకొని, తమ వ్యాపార సంస్థలు యూఎస్‌లో పెట్టుబడులు పెట్టడానికి వెనకాడతాయని’ అని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ‘X’ వేదికగా స్పందిస్తూ పోస్టు పెట్టారు.
‘సంక్లిష్టమైన ఉత్పత్తులను తయారుచేసే విదేశీ కంపెనీలు అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టినప్పుడు నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం తప్పనిసరిగా ఉంటుంది. కొంతకాలం పాటు నైపుణ్యంతో కూడిన కార్మికులను ఆ కంపెనీలు మా దేశానికి తీసుకురావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన కార్మికులు వారితో కలిసి శిక్షణ పొందాలి.. లేదంటే ఆ భారీ పెట్టుబడుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మేము విదేశీ సంస్థల నుంచి కార్మికులను స్వాగతిస్తున్నాము. వారి నుంచి నైపుణ్యాలు నేర్చుకుని వారి కన్నా మెరుగ్గా అభివృద్ధి చెందుతాం.” అని పోస్ట్ చేశారు.


