Donald Trump-Elon Musk: ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ‘ది అమెరికా పార్టీ’ ప్రకటించిన సంగతి తెలిసిందే. మస్క్ కొత్త పార్టీ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
గత కొద్ది రోజులుగా మస్క్ పూర్తిగా గాడి తప్పడం విచారకరమన్నారు. పార్టీ ప్రకటన హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. తమ మధ్య బంధాన్ని ముగించేలా మస్క్ ప్రవర్తన ఉందని మండిపడ్డారు. అమెరికాలో మూడో రాజకీయ పార్టీ విజయవంతమైన దాఖలాలు లేవన్నారు. అమెరిన్లు మూడో పార్టీని అంగీకరించరని.. ప్రజల మధ్య గందరగోళానికి దారి తీస్తుందని ట్రంప్ ఫైర్ అయ్యారు.
ప్రస్తుతం రిపబ్లికన్ల ప్రభుత్వం సజావుగా నడుస్తోందని పేర్కొన్నారు. ఇటీవలే అమెరికా దేశ చరిత్రలోనే తొలిసారి ఓ భారీ బిల్లును కాంగ్రెస్‌లో ఆమోదించుకున్నామని గుర్తుచేశారు. ఈ బిల్లు చాలా గొప్పది అని.. కానీ మస్క్‌కు ఎందుకు నచ్చలేదో అర్థం కావడం లేదన్నారు. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని మస్క్ కోరుకుంటున్నారని.. కానీ అది అంత త్వరగా సాధ్యపడదన్నారు. అమెరికా ప్రజలను రక్షించడమే తన తొలి ప్రాధాన్యమని వెల్లడించారు.
Also Read: కొత్త పార్టీని ప్రకటించిన ఎలాన్ మస్క్
గతేడాది జరిగిన అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు మస్క్ మద్దతు ప్రకటించారు. ఆయనకు సపోర్ట్‌గా ప్రచారం కూడా నిర్వహించారు. మస్క్ సపోర్ట్ ట్రంప్ గెలుపునకు కొంత సాయపడింది. దీంతో ఇద్దరి మధ్య మైత్రి బలపడింది. కానీ ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మస్క్ బహిరంగంగానే వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మస్క్ కొత్త పార్టీ పెడుతున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు. అమెరికన్లకు స్వేచ్ఛ ఇవ్వడమే తన పార్టీ లక్ష్యమని వెల్లడించారు. అయితే తన పార్టీ రిజిస్ట్రేషన్ మాత్రం చేయించలేదు.
ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. బ్రిక్స్ దేశాలతో సంబంధాలు పెట్టుకునే దేశాలకు 10 శాతం అదనంగా పన్నులు విధించనున్నట్లు ప్రకటించారు. బ్రిక్స్ దేశాలు అంటే బ్రెజిల్, రష్యా ఇండియా, చైనా, సౌతాఫ్రికా దేశాలు. గతేడాది ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా దేశాలు కూడా బ్రిక్స్‌లో సభ్యులుగా చేరాయి.