Best Subject For Entrepreneurs: నేటి యువతరం కల వ్యాపారవేత్తగా ఎదగడం! పాఠశాల రోజుల నుంచే స్టార్టప్‌ల గురించి, సరికొత్త ఆవిష్కరణల గురించి ఆలోచిస్తున్నారు. మరి, ఆ కలను సాకారం చేసుకోవాలంటే ఏ చదువు చదవాలి..? ఏ సబ్జెక్టుపై పట్టు సాధించాలి..? ఇదిగో, ఇదే అంశంపై ఇప్పుడు ఇద్దరు టెక్ దిగ్గజాల మధ్య ఆసక్తికర చర్చ నడుస్తోంది. టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ వ్యాపారానికి ‘గణితమే’ మార్గం అంటుంటే, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ‘భౌతికశాస్త్రం’ కూడా ముఖ్యమేనని వాదిస్తున్నారు. ఇంతకీ వీరిలో ఎవరి వాదన సరైనది? విద్యార్థులు ఏ దారిలో పయనిస్తే విజయతీరాలకు చేరగలరు?
అసలు చర్చ ఎక్కడ మొదలైందంటే:
భవిష్యత్ వ్యాపారవేత్తలు గణితానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్ట్ చేశారు. “మీరు కంపెనీలను నిర్మించాలనుకుంటే, గణితాన్ని అభ్యసించండి,” అని ఆయన సూచించారు. గణితంపై పట్టు సాధిస్తే స్వతంత్రంగా, తార్కికంగా ఆలోచించే సామర్థ్యం పెరుగుతుందని ఆయన విశ్లేషించారు. ఎలాంటి గందరగోళానికి తావులేకుండా సమస్యలను విశ్లేషించి, వాటికి సరైన పరిష్కారాలు కనుగొనవచ్చని దురోవ్ నొక్కిచెప్పారు. వ్యాపార నిర్మాణానికి, ప్రాజెక్టుల నిర్వహణకు ఈ నైపుణ్యాలే పునాది అని ఆయన అభిప్రాయపడ్డారు.
రంగంలోకి దిగిన ఎలాన్ మస్క్:
పావెల్ దురోవ్ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. లక్షలాది మంది దీనిపై స్పందించారు. అయితే, ఈ వాదనతో ఎక్స్ అధినేత, టెస్లా, స్పేస్‌ఎక్స్ వంటి సంస్థల అధిపతి ఎలాన్ మస్క్ విభేదించారు. దురోవ్ పోస్ట్‌కు బదులిస్తూ ఆయన కేవలం ఒక్క మాటలో “ఫిజిక్స్ (గణితంతో)” అని కామెంట్ చేశారు. మస్క్ నేపథ్యం చూస్తే, ఆయన భౌతిక శాస్త్రం (ఫిజిక్స్), ఆర్థిక శాస్త్రం (ఎకనామిక్స్) రెండింటిలోనూ పట్టభద్రుడు. క్లిష్టమైన వాస్తవ ప్రపంచ సమస్యలను అర్థం చేసుకుని, వాటికి పరిష్కారాలు కనుగొనడంలో ఫిజిక్స్ కీలక పాత్ర పోషిస్తుందని మస్క్ చాలా సందర్భాల్లో చెప్పారు.
దురోవ్ సున్నితమైన స్పందన:
మస్క్ కామెంట్‌పై దురోవ్ కూడా అంతే సున్నితంగా స్పందించారు. గణితంలో బలమైన పునాది ఉన్నప్పుడే ఫిజిక్స్ వంటి సబ్జెక్టులు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. గణితాన్ని వాస్తవ ప్రపంచానికి అన్వయించడానికి భౌతిక శాస్త్రం, కంప్యూటర్ సైన్స్ అద్భుతమైన మార్గాలని ఆయన అంగీకరించారు. ఈ సబ్జెక్టుల వల్ల తార్కిక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు మరింత పదునుదేలతాయని పేర్కొన్నారు.
నెటిజన్ల మిశ్రమ స్పందన:
ఈ ఇద్దరు టెక్ దిగ్గజాల చర్చపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేవలం సబ్జెక్టులే కాదు, ధైర్యం, నాయకత్వ లక్షణాలు, మానవ సంబంధాలు వంటివి కూడా వ్యాపారవేత్తలకు ముఖ్యమని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే, పాఠశాల విద్యలో ఇలాంటి నైపుణ్యాలపై దృష్టి సారించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. “ఫిజిక్స్ అనేది జ్ఞానం అయితే, గణితం ఆ జ్ఞానాన్ని వ్యక్తపరిచే భాష లాంటిది. అందుకే రెండూ ముఖ్యమే” అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. అంతిమంగా, సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ వంటి రంగాల్లో రాణించాలంటే గణితం పునాది అని ఎక్కువమంది అంగీకరించారు.


