Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్US HIRE bill : భారతీయ ఐటీ ఉద్యోగులకు కొత్త కష్టం.. ట్రంప్‌ తెస్తున్న హైర్...

US HIRE bill : భారతీయ ఐటీ ఉద్యోగులకు కొత్త కష్టం.. ట్రంప్‌ తెస్తున్న హైర్ యాక్ట్‌తో ఉద్యోగాలకు ముప్పు

Effect of HIRE Bill on Indian IT: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత వలస విధానాల్లో సమూల మార్పులు తెస్తున్నారు. అమెరికా ఫస్ట్‌ నినాదంతో పాలన కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే అన్ని చట్టాల్లోనూ కీలక మార్పులు తెస్తున్నారు. ప్రధానంగా విదేశాల నుంచి అమెరికాకు వస్తున్న విద్యార్థులు, ఉద్యోగులపై ట్రంప్ ఫోకస్‌ పెట్టారు. విదేశీ ఉద్యోగుల వల్ల అమెరికా ప్రజానికానికి ఉద్యోగాలు దొరకడం లేదనే ఉద్దేశ్యంతో HIRE Act–2025 అనే కొత్త హైరింగ్ పాలసీని ప్రవేశపెట్టారు. విదేశీ ఉద్యోగులను నియంత్రించి, అమెరికా పౌరులకే ఎక్కువ అవకాశాలు దక్కేలా ఈ బిల్లును రూపొందించినట్లు స్పష్టమవుతోంది. అయితే, ఈ నూతన పాలసీ భారతీయ ఐటీ పరిశ్రమతో పాటు టెక్ ఉద్యోగుల భవిష్యత్తుపై భారీ ప్రభావాన్ని చూపనుందని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

భారతీయులపైనే అధిక ప్రభావం..

కాగా, ట్రంప్ తీసుకొచ్చిన ఈ కొత్త బిల్లు భారతీయ ఐటీ ఉద్యోగులపై అధిక ప్రభావం చూపనుంది. ఎందుకంటే, అమెరికా కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకుంటే.. లేదా విదేశాల్లో పని చేసే సంస్థలకు సేవలకి డబ్బు చెల్లిస్తే.. ఆ మొత్తంపై 25% ట్యాక్స్ కట్టాల్సిందేనని ఈ బిల్లులో పేర్కొన్నారు. తద్వారా, ఆయా కంపెనీలు భారతీయ, వలస ఉద్యోగులను నియమించుకోవడాన్ని తగ్గించే అవకాశం ఉంది. దీంతో ఈ బిల్లు భారతీయ టెక్ కంపెనీల ఔట్ సోర్సింగ్ సేవలతో పాటు విదేశాలకు ఆన్‌సైట్‌ కోసం వెళుతున్న టెక్కీల భవిష్యత్తుపై కూడా తీవ్ర ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. ఈ ‘ఔట్‌సోర్సింగ్ పేమెంట్’పై ట్యాక్స్ అమెరికా వినియోగదారులకు లబ్ధి చేకూర్చే విధంగా ఉపయోగించనుంది. ఈ డబ్బును ‘డొమెస్టిక్ వర్క్‌ఫోర్స్ ఫండ్’ పేరుతో అమెరికాలోనే ఉపాధి, శిక్షణ కార్యక్రమాలకు వాడనున్నారు. అమెరికా కంపెనీలు చేసే ఐటీ, బిజినెస్ ప్రాసెసింగ్ పనిలో 60% వరకు భారత్‌లోని కంపెనీలకే ఔట్‌సోర్స్ పనులు అప్పగిస్తోంది. అందువల్ల ట్రంప్ తెచ్చిన ఈ కొత్త చట్టంతో ఆయా కంపెనీలు 25% అదనపు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల అమెరికా కంపెనీలు విదేశీలను ఉద్యోగాల్లోకి తీసుకోవడాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా భారతదేశంలోని ఐటీ పరిశ్రమను భారీగా కుదిపేయనుంది.

టెక్‌ ఉద్యోగులకు కష్టకాలం..

ఇప్పటికే ఏఐ ప్రకంపనలతో అల్లాడిపోతున్న టెక్కీలు అమెరికా తెచ్చిన కొత్త చట్టంతో జాబ్ సెక్యూరిటీపై ఆందోళన చెందుతున్నారు. కొత్త ప్రాజెక్టుల సంగతి పక్కన పెడితే యూఎస్ మార్కెట్ నుంచి ఇప్పటికే ఉన్న ఆర్డర్లు చేజారకుండా నిలుపుకోవటం కూడా కష్టంగా మారవచ్చని ఆందోళనలు భారతీయ ఐటీ కంపెనీల్లో పెరుగుతోంది. కొత్త ట్యాక్స్ వల్ల వచ్చే అదనపు ఖర్చు అమెరికాలో వ్యాపార ఖర్చుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కంపెనీలు తమ కంపెనీ మార్జిన్లు తగ్గించుకోవాలి లేదా ఖర్చు కొంత క్లయింట్ మీద వేయాల్సి ఉంటుంది. ఇదే తీరులో కొనసాగితే భారతీయ ఐటీ కంపెనీలు అమెరికాపై ఆధారపడకుండా ఆసియా, యూరోప్ వంటి ఇతర మార్కెట్లవైపు దృష్టి మళ్లించాల్సిన పరిస్థితి వస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే, ఈ బిల్లు ఇంకా ఆమోదం పొందనప్పటికీ యూఎస్‌ అసెంబ్లీ మాత్రం ప్రవేశపెట్టారు. దీనిలో ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయనే చర్చ జరుగుతోంది. ట్రంప్‌ ఇలాంటి కఠినమైన నిర్ణయాలతో పాలన సాగిస్తే భారతీయుల ఉద్యోగ భద్రతకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad