Elon Musk And Donald Trump: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి అమెరికా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. ఇటీవల ట్రంప్ ప్రకటించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్‌పై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ బిల్ వల్ల పన్ను చెల్లింపు దారులకు అనేక విధాలుగా నష్టం వాటిల్లుండని చెప్పారు. ఈ మేరకు విమర్శలు చేస్తూనే.. కొత్త పార్టీ స్థాపించడంపై కీలక ప్రకటన చేశారు. ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును తాను ముందు నుంచే గుర్తు చేస్తూ, ఇది దేశ రుణ భారం పెంచే, ప్రజల జీవితాలను ప్రభావితం చేసే చర్యగా పేర్కొన్నారు. తమ అభ్యంతరాలను తేలికగా తీసుకుంటే, ప్రజలకు ప్రత్యామ్నాయంగా కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని హెచ్చరించారు.
“ఒక కొత్త పార్టీ అవసరం ఉంది”: మస్క్
సోషల్ మీడియా వేదికగా మస్క్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాయి. “ఈ బిల్లును ఆమోదించడమే పిచ్చి పని. ఇది ప్రభుత్వ వ్యయాలను నియంత్రించాలనే ప్రచారానికి విరుద్ధంగా ఉంది. రుణ పరిమితిని ట్రిలియన్స్ డాలర్ల మేర పెంచేలా చేస్తోంది,” అని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల మనోభావాలను ప్రతిబింబించేలా కొత్త రాజకీయ శక్తి అవసరం ఉందని, అందుకోసం తాను “ది అమెరికా పార్టీ” అనే పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతామని పేర్కొన్నారు.
రిపబ్లికన్-డెమోక్రటిక్ కలయికపై విమర్శ
ఈ బిల్లుకు మద్దతు తెలిపిన కొన్ని చట్టసభ సభ్యులపై తీవ్ర విమర్శలు చేశారు. “అధికారంలోకి రాకముందు ప్రభుత్వ ఖర్చులను తగ్గిస్తామన్నవారు, ఇప్పుడు అదే ఖర్చు పెరిగేలా ఓటేస్తే, ప్రజలను మోసం చేసినట్టే. ఇటువంటి నాయకులు పదవుల్లో ఉండటం సిగ్గు చేటు,” అని మండిపడ్డారు. మస్క్ వ్యాఖ్యల ప్రకారం, ప్రస్తుతం అమెరికాలో ప్రజల గళాన్ని నిజంగా వినగల నాయకత్వం లేదు. “రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలను ఒకే దిశలో నడిచే ‘యూనిపార్టీ’గా భావిస్తూ, వాటికి సరైన ప్రత్యామ్నాయంగా తమ పార్టీ ఎదగాల్సిన అవసరం ఉందని” స్పష్టం చేశారు. టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి దిగ్గజ కంపెనీల అధినేతగా ఉండే మస్క్, గతంలో రాజకీయ వ్యవస్థపై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నా, ఈసారి మాత్రం ప్రత్యక్షంగా రాజకీయ రంగ ప్రవేశానికి సంకేతాలు ఇస్తున్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఆయన చూపిన స్పందనతో అమెరికా రాజకీయాలలో కొత్త ఊసులు మొదలయ్యే అవకాశముంది. మరి మస్క్ పార్టీ రాజకీయ వేదికగా ఎంత ప్రభావం చూపించగలడో చూడాలి.