Elon Musk Announces Plans to Sue Apple: యాపిల్ కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని బిలియనీర్ ఎలాన్ మస్క్ హెచ్చరించారు. యాపిల్ తన యాప్ స్టోర్లో X మరియు దాని Grok AI యాప్‌లను అగ్రస్థానంలో ఉంచడం లేదని మస్క్ ఆరోపిస్తున్నారు. దీనిని ఆయన ‘యాంటీట్రస్ట్’ నిబంధనల ఉల్లంఘనగా పేర్కొన్నారు.
తాను యాపిల్‌పై కేసు వేయబోతున్నట్లు మస్క్ Xలో పోస్ట్ చేశారు. “హే యాపిల్ యాప్ స్టోర్, X ప్రపంచంలోనే నంబర్ 1 వార్తల యాప్, Grok అన్ని యాప్‌లలో నంబర్ 5 స్థానంలో ఉన్నా, వాటిని మీ ‘ఖచ్చితంగా ఉండవలసినవి’ (Must Have) విభాగంలో ఎందుకు ఉంచడం లేదు?” అని ఆయన ప్రశ్నించారు. ఇది రాజకీయాలా అని మస్క్ సూటిగా అడిగారు.
OpenAI మినహా ఏ ఇతర AI కంపెనీ కూడా యాప్ స్టోర్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకోవడం అసాధ్యం అని మస్క్ ఆరోపించారు. ఇది స్పష్టంగా యాంటీట్రస్ట్ నిబంధనల ఉల్లంఘన అని, కాబట్టి xAI వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని మస్క్ పేర్కొన్నారు. దీనిపై మరిన్ని వివరాలను ఆయన వెల్లడించలేదు.
మస్క్ ఆరోపణలను యాపిల్ తిరస్కరించింది. తమ యాప్ స్టోర్ నిష్పాక్షికంగా ఉంటుందని, యాప్‌లను అల్గారిథమ్‌ల ద్వారా, నిపుణుల సమీక్షల ద్వారా ఎంపిక చేస్తామని యాపిల్ తెలిపింది. వినియోగదారులకు సురక్షితమైన యాప్‌లను అందించడమే తమ లక్ష్యమని వివరించింది.
గత కొన్నేళ్లుగా యాపిల్ యాంటీట్రస్ట్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఇటీవల ఐరోపా యూనియన్, యాప్ డెవలపర్లు బయటి చెల్లింపుల ఎంపికలను వినియోగదారులకు చూపకుండా అడ్డుకున్నందుకు యాపిల్‌పై 500 మిలియన్ యూరోల జరిమానా విధించింది.


