Saturday, July 12, 2025
Homeఇంటర్నేషనల్Elon Musk: కొత్త పార్టీని ప్రకటించిన ఎలాన్ మస్క్

Elon Musk: కొత్త పార్టీని ప్రకటించిన ఎలాన్ మస్క్

Elon Musk New Party: స్పేస్ ఎక్స్ అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ అన్నంత పని చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో కొత్త పార్టీని పెడతానని ప్రకటించిన మస్క్..ఎట్టకేలకు ‘ది అమెరికా పార్టీ’ పెడుతున్నట్లు ప్రకటించారు. “మేక్ అమెరికా.. అమెరికా ఎగైన్.. అమెరికన్లకు స్వేచ్ఛను తిరిగి ఇస్తా” నినాదంతో ఈ పార్టీ పెట్టారు. గతంలోనూ పార్టీ పెట్టే అంశంపై ఓటింగ్‌ నిర్వహించగా 80శాతం మంది అనుకూలంగా ఓటు వేశారు. ఈ క్రమంలో అమెరికా పార్టీ అంటూ మస్క్ చేసిన పోస్ట్‌ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

- Advertisement -

తాజాగా కొత్త పార్టీ ఏర్పాటుపై ఎక్స్ వేదికగా మరోసారి పోల్ నిర్వహించారు. ఈ పోల్‌లో పాల్గొన్న వారు దాదాపు 12లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. 65.40శాతం మంది మూడో పార్టీకి ఓటు వేశారు. దీంతో అమెరికాలో రెండు పార్టీలకు వ్యతిరేకంగా మూడు పార్టీలు కావాలని కోరుకుంటున్నారని.. అందుకు తగ్గట్టుగా ఇవాళ అమెరికా పార్టీ రూపుదిద్దుకుందని స్పష్టం చేశారు. 2026లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో రెండు లేదా మూడు సెనేట్ స్థానాలు, ఎనిమిది నుంచి పది ప్రతినిధుల సభ స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. ఈ స్థానాల్లో గెలిచి కీలక చట్టాలపై నిర్ణయాత్మక శక్తిగా మారడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకోసం తమ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తుందని మస్క్ వివరించారు.

అయితే మస్క్.. ఇప్పటివరకు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద పార్టీని అధికారికంగా నమోదు చేయలేదు.ఇప్పటికే బలంగా పాతుకుపోయిన రిపబ్లిక్, డెమోక్రటిక్ పార్టీలను తట్టుకుని మస్క్ పార్టీ నిలబడటం కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి అపర కుబేరుడు అయిన మస్క్ తనకు ఎదురుకాబోయే అడ్డంకులను అధిగమించి ఎంతవరకు పార్టీని నిలబెడతారో వేచి చూడాలి.

ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రవేశపెట్టిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ను మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ బిల్లు ఆమోదం పొందితే విపరీతంగా ఖర్చులు పెరుగుతాయని మస్క్ ఆరోపిస్తున్నారు. తద్వారా అమెరికా దివాళా తీస్తుందని అభిప్రాయపడుతున్నారు. అందుకే తొలి నుంచి మస్క్ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

అయితే ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గకుండా బిల్లు ఆమోదం వైపే మొగ్గు చూపారు. ఎట్టకేలకు తన కల నెరవేర్చుకున్నారు. ‘బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు’ చట్టంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్‌లోని ఉభయసభల ఆమోదం పొందిన ఈ బిల్లు అధ్యక్షుడి సంతకంతో చట్టంగా రూపాంతరం చెందింది. బిల్లు ఆమోదంతో ట్రిలియన్లకొద్దీ డాలర్ల పన్ను మినహాయింపులతో పాటు ఆహార కూపన్ల కోత, ఆరోగ్య బీమాకు కోట్లాది మంది దూరమవుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News