Elon Musk Criticises Donald Trump: అమెరికా రాజకీయాల్లో ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన “బిగ్ బ్యూటిఫుల్ బిల్” తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ బిల్లుపై ప్రపంచ కుబేరుడు, టెస్లా స్పేస్‌ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇది అమెరికాలో మిలియన్ల కొద్దీ ఉద్యోగాలను నాశనం చేస్తుందని, దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు హాని చేస్తుందని, అలాగే క్లీన్ ఎనర్జీ వంటి భవిష్యత్తు ఆధారిత పరిశ్రమలను దెబ్బతీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఎలాన్ మస్క్ వాదన : శనివారం (జూన్ 28, 2025) నాడు X లో మస్క్ ఒక పోస్ట్ చేస్తూ, “సెనేట్ తాజా బిల్లు అమెరికాలో మిలియన్ల కొద్దీ ఉద్యోగాలను నాశనం చేస్తుంది. మన దేశానికి అపారమైన వ్యూహాత్మక నష్టాన్ని కలిగిస్తుంది!” అని పేర్కొన్నారు. ” ఇది గత పరిశ్రమలకు ఆర్థిక సహాయం అందిస్తుంది, అయితే భవిష్యత్తు ఆధారిత పరిశ్రమలను తీవ్రంగా దెబ్బతీస్తుంది” అని వెల్లడించారు.
ట్రంప్ బిల్లులోని ముఖ్య అంశాలు: రిపబ్లికన్ సెనేటర్లు ట్రంప్ జూలై 4 గడువును చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ 940 పేజీల బిల్లులో పలు కీలక అంశాలు ఉన్నాయి. మెడికైడ్, ఫుడ్ స్టాంపులు వంటి కార్యక్రమాలకు భారీగా నిధుల కోత విధించునున్నారు. పేదల ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రతకు సంబంధించిన పథకాలకు కేటాయింపులను గణనీయంగా తగ్గానున్నాయి. కొన్ని పన్ను మినహాయింపులను విస్తరించి, దేశ రక్షణకు, అక్రమ వలసదారుల బహిష్కరణకు అధిక నిధులు కేటాయిస్తున్నారు. సరిహద్దు భద్రత ప్రణాళికలో భాగంగా 350 బిలియన్ డాలర్లు, మెరికా-మెక్సికో సరిహద్దు గోడ విస్తరణకు 46 బిలియన్ డాలర్లు వెచ్చించునున్నారు. ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు నియామకాలలో భాగంగా 10,000 కొత్త ICE (ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్) అధికారుల నియామకం, వారికి ఒక్కొక్కరికి 10,000 డాలర్ల సైనింగ్ బోనస్‌తో సహ ఇవ్వనున్నారు. సంవత్సరానికి దాదాపు 1 మిలియన్ మందిని తొలగించే లక్ష్యంతో ట్రంప్ హామీ ఇచ్చిన అతిపెద్ద సామూహిక బహిష్కరణ ప్రయత్నానికి ఈ చొరవ కేంద్రంగా ఉంది.
బిల్లు ప్రస్తుత స్థితి: ప్రస్తుతం హౌస్, సెనేట్ రెండింటిలోనూ మెజారిటీ ఉన్న రిపబ్లికన్‌లకు జూలై 4 లోగా తమ విస్తృత పన్ను & వ్యయ బిల్లును ఆమోదించాలని ట్రంప్ ఆదేశించారు. రిపబ్లికన్ నాయకులు డెమోక్రాట్ల అభ్యంతరాలను అధిగమించి సెనేట్‌లో బిల్లును నెట్టేస్తున్నారు. అయితే, మెడికైడ్, ఫుడ్ స్టాంపులు వంటి కార్యక్రమాలకు కోత విధించడంపై కొందరు GOP (గ్రాండ్ ఓల్డ్ పార్టీ – రిపబ్లికన్ పార్టీ) సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లు ఇప్పుడు తుది ఓటింగ్ కోసం హౌస్‌కు తిరిగి వెళ్లనుంది, దీని ఆర్థిక, రాజకీయ ప్రభావాలపై తీవ్ర చర్చ జరుగుతోంది.