Emma Thompson Says Trump Called Her for a Date: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రముఖ బ్రిటిష్ నటి ఎమ్మా థాంప్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తన మాజీ భర్త కెన్నెత్ బ్రనాగ్‌తో విడాకులు తీసుకున్న రోజునే ట్రంప్ తనకు ఫోన్ చేసి డేట్‌కు రమ్మని అడిగారని తెలిపారు. ఆ ఆఫర్‌ను అంగీకరించి ఉంటే, అమెరికా చరిత్ర గతిని మార్చి ఉండేదాన్నేమో అని ఆమె చమత్కరించారు.
షూటింగ్‌లో ఉండగా కాల్ చేసి..
ఆగస్టు 8న స్విట్జర్లాండ్‌లో జరిగిన లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘లియోపార్డ్ క్లబ్ అవార్డు’ అందుకున్న సందర్భంగా ఎమ్మా థాంప్సన్ ఈ విషయాన్ని వెల్లడించారు. 1998లో తాను ‘ప్రైమరీ కలర్స్’ సినిమా షూటింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని ఆమె గుర్తు చేసుకున్నారు. అప్పుడు ఆమె తన ట్రైలర్‌లో ఉండగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తితే అవతలి నుంచి “హలో, నేను డొనాల్డ్ ట్రంప్” అని వినిపించింది. అది ఒక జోక్ అనుకున్నానని ఆమె చెప్పారు.
ట్రంప్ తనతో “నా అందమైన ప్రదేశాల్లో ఒకదానిలో మీరు వచ్చి ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనం డిన్నర్ చేయవచ్చు” అని అడిగారని థాంప్సన్ తెలిపారు. దానికి ఆమె “చాలా మంచి ఆఫర్, చాలా థ్యాంక్స్, మళ్ళీ కాల్ చేస్తాను” అని చెప్పి కాల్ కట్ చేశారట. ఆ తర్వాత ఆమెకు ఒక విషయం అర్థమైందని, సరిగ్గా అదే రోజు తన విడాకుల పత్రాలు ఖరారయ్యాయని చెప్పారు. “విడాకులు తీసుకున్న మంచి అమ్మాయిని వెతికి పట్టుకుని ఉంటారు” అని ఆమె నవ్వుతూ వ్యాఖ్యానించారు.
అంతకుముందు, సల్మా హయక్ అనే మరో నటి కూడా ట్రంప్ తనను డేట్‌కు పిలిచారని గతంలో చెప్పారు.


