Fire at Russian industrial plant kills 11: రష్యాలోని రియాజాన్ ప్రాంతంలో ఒక పారిశ్రామిక ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదం, పేలుడు కారణంగా 11 మంది మరణించగా, 130 మంది గాయపడ్డారని రష్యా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం మాస్కోకు ఆగ్నేయంగా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిలోవ్స్కీ జిల్లాలోని ‘ఎలాస్టిక్’ ప్లాంట్‌లో జరిగింది.
ఈ ప్రమాదం ఒక గన్‌పౌడర్ వర్క్‌షాప్‌లో మంటలు చెలరేగడం వల్ల జరిగిందని, ఇది పేలుడుకు దారితీసిందని రష్యన్ స్టేట్ న్యూస్ ఏజెన్సీ RIA నోవోస్తి తెలిపింది. రష్యన్ అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ ప్రకారం, సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ గాలింపు చర్యల్లో శనివారం రాత్రి అదనంగా మరో ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి.
ALSO READ: Alaska Summit: శాంతికి పుతిన్ షరతు.. దొనెట్‍స్క్ ఇస్తేనే చర్చలు – అలస్కా భేటీలో తేల్చిచెప్పిన రష్యా!
గాయపడిన వారిలో 29 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. వారిలో 13 మంది రియాజాన్‌లో, మిగిలిన 16 మందిని మాస్కోలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. శిథిలాల కింద నుంచి ముగ్గురిని రక్షించినట్లు ప్రాంతీయ అధికారులు తెలిపారు.
ALSO READ: Antarctica: చనిపోయిన 65 ఏళ్ల తర్వాత అంటార్కిటిక్‌లో బయటపడిన శాస్త్రవేత్త మృతదేహం
నాలుగేళ్లలో ఇది రెండోసారి..
ఈ విషాదకర ఘటన కారణంగా రియాజాన్ గవర్నర్ పావెల్ మాల్కోవ్ సోమవారం రోజున సంతాప దినంగా ప్రకటించారు. ఈ ప్రాంతంలోని అన్ని సాంస్కృతిక సంస్థలు, టీవీ, రేడియో ఛానెళ్లు వినోద కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని కోరారు. నాలుగేళ్లలో ఈ ప్లాంట్‌లో జరిగిన రెండో ప్రాణాంతక పేలుడు ఇది. అక్టోబర్ 2021లో కూడా పేలుడు పదార్థాల తయారీదారు ‘రాజ్రియాడ్’ సంస్థకు చెందిన ఒక వర్క్‌షాప్‌లో పేలుడు సంభవించి 17 మంది మరణించారు.


