ఫ్లోరిడా, నవంబర్ 2 (తెలుగు ప్రభ): అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. తొమ్మిది మందితో ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ ఒక్కసారిగా గాలిలో అదుపుతప్పి కిందకు దూసుకొచ్చి కుప్పకూలింది. నేలను బలంగా ఢీకొన్న వెంటనే విమానం భారీ మంటలతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. లియర్‌జెట్ 60 రకానికి చెందిన ఈ ప్రైవేట్ విమానం టెక్సాస్‌లోని ఆస్టిన్-బెర్గ్స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బహామాస్ దీవులకు బయలుదేరింది. ఆదివారం మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. గ్రీన్ఏకర్స్ ప్రాంతంలోని నివాస ప్రాంతానికి సమీపంలో విమానం కూలిపోయింది. రోడ్డుపై భారీ గుంత ఏర్పడటంతో పాటు విమానం శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది.
పైలట్ అత్యవసర సందేశం
ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు విమానంలో మంచు పేరుకుపోతోందని, తీవ్ర గాలుల కారణంగా విమానం కుదుపులకు గురవుతోందని పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విమానాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు అనుమతి కోరాడు. అయితే కొద్దిసేపటికే విమానం వేగంగా కిందకు దిగడం ప్రారంభించింది. మొదట నిమిషానికి 10 వేల అడుగుల వేగంతో కిందకు దిగుతున్నట్లు పైలట్ సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత వేగం నిమిషానికి 20 వేల అడుగులకు పెరిగింది. పరిస్థితి విషమించడంతో పైలట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించి మేడే సందేశం పంపాడు. చివరికి విమానం అదుపుతప్పి నేలను ఢీకొట్టింది.
ప్రమాదంపై దర్యాప్తు
అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ విమానంలో ఉన్న తొమ్మిది మంది మరణించినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనను తీవ్ర విషాదంగా అభివర్ణించారు. అలాగే ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ స్పందించారు. ప్రమాద సమయంలో విమానం నేలపై ఉన్న ఇళ్లకు, రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలకు అతి సమీపంలో కూలినట్లు తెలిపారు. అయితే, ఎవరికి ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరిగినట్లు ప్రాథమికంగా సమాచారం లేదని వెల్లడించారు. మరోవైపు, ప్రమాద ప్రాంతానికి సమీపంలోని మొబైల్ హోమ్ నివాస సముదాయం నుంచి సుమారు 600 మందిని అధికారులు ఖాళీ చేయించారు. విమాన ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (ఎన్టీఎస్బీ) దర్యాప్తు చేపట్టాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ప్రమాదానికి కారణమయ్యాయా అనే అంశంతో పాటు ఇతర కారణాలనూ పరిశీలిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ప్రమాదానికి అసలు కారణం వెల్లడికానుంది.

