టెల్ అవీవ్, అక్టోబర్ 3 (తెలుగు ప్రభ): టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాడికి పాల్పడిన కో-పైలట్‌ను ఒమన్‌కు చెందిన హమామ్ అల్-హమ్మామీగా గుర్తించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
గతంలోనే నిషేధం..?
అల్ అరేబియా ఇంగ్లిష్ నివేదిక ప్రకారం.. సిరియాలో ఉన్న సమయంలో హమామ్ అల్-హమ్మామీ తీవ్రవాద భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. దీంతో గతంలో ఒమన్‌లో విమానాలు నడపకుండా అతడిపై నిషేధం విధించారు. అతడి తీవ్రవాద భావజాలంపై అనుమానాలు ఉండటమే ఇందుకు కారణమని నివేదిక పేర్కొంది. అలాగే ఒమన్ జాతీయ విమానయాన సంస్థలో శిక్షణకు సంబంధించిన బాధ్యతల నుంచి కూడా అతడిని గతంలో తొలగించారు.
యూఏఈలో జన్మించినట్లు నివేదికలు..
కో-పైలట్ హమామ్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఒమన్ తండ్రి, సిరియా తల్లికి జన్మించినట్లు అల్ అరేబియా ఇంగ్లిష్ నివేదిక చెబుతోంది. అతడు తన జీవితంలో కొంతకాలం యూఏఈలో గడిపినట్లు పేర్కొంది. దాడి ఘటన అనంతరం సౌదీ అరేబియాలో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిన తర్వాత కో-పైలట్‌ను యూఏఈకి తరలించినట్లు తెలిపింది. అక్కడ ఉగ్రవాద కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించింది.
ఫ్లైదుబాయ్‌లో ఎనిమిది నెలలుగా..
అల్-హమ్మామీ ఫ్లైదుబాయ్‌లో సుమారు ఎనిమిది నెలలుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు రాయల్ ఎయిర్ మారోక్‌లో పనిచేసినట్లు కూడా ఓ నివేదిక పేర్కొంది.
ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు..
సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ ఎఫ్‌జెడ్1073 విమానంలో కో-పైలట్ రెచ్చిపోయాడు. కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై కో-పైలట్ దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తీవ్ర గాయాలపాలైనప్పటికీ కెప్టెన్ మచ్ఛార్ కాక్‌పిట్ తలుపు తెరిచారు. అనంతరం ప్రయాణికులు, సిబ్బంది జోక్యం చేసుకుని దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనపై యూఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌కు చెందిన సంబంధిత సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. దాడి వెనుక ఉద్దేశం ఏమిటన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. కో-పైలట్ నేపథ్యం, విమాన సిబ్బంది నియామక ప్రక్రియ, భద్రతా తనిఖీలపైనా ఆరా తీస్తున్నారు.

