అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి గ్రహీత జిమ్మీ కార్టర్(Jimmy Carter) కన్నుమూశారు. కార్టర్ జార్జియాలోని ప్లెయిన్స్‌లో ఉన్న తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కార్టర్ ఫౌండేషన్ తెలిపింది. 1924 అక్టోబర్ 1న జిమ్మీ కార్టర్ జన్మించారు. ఈ ఏడాది తన 100వ పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకున్నారు. దీంతో యూఎస్ అధ్యక్షుడిగా పనిచేసి వందేళ్లు జీవించిన వ్యక్తిగానూ నిలిచారు. ఆయన 1977 నుంచి 1981 వరకు అమెరికా 39వ అధ్యక్షుడిగా పనిచేశారు.
అధ్యకుడిగా దిగిపోయిన తర్వాత 1982లో ‘కార్టర్ సెంటర్’ను స్థాపించారు. సామాజిక, ఆర్థిక న్యాయాన్ని ప్రోత్సహించడానికి అవిశ్రాంతంగా శ్రమించిన కార్టర్‌కు 2002లో నోబెల్ శాంతి బహుమతి వరించింది. నేవీ ఉద్యోగిగా, గవర్నర్‌గా, అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. కాగా జిమ్మీ కార్టర్ మృతి పట్ల అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.