Paris: దక్షిణ ఫ్రాన్స్‌ను అగ్నికాండ అతలాకుతలం చేస్తుంది. ఈ అగ్నికాండ పారిస్ కి సమానమైన భూభాగాన్ని దహనం చేసింది. కార్చిచ్చుని అదుపులోకి తేవడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ కార్చిచ్చు స్థానిక ప్రజలను, అగ్నిమాపక సిబ్బందిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఔదీ ప్రాంతంలోని కార్బియర్స్ కొండప్రాంతాల్లో మంటలు వేగంగా వ్యాపించాయి. ఇప్పటి వరకు సుమారు 16,000 హెక్టార్లకు పైగా అడవి ప్రాంతం బూడిద అయ్యింది.
ఇప్పటి వరకు రిబాటీ, సెయింట్ లారెంట్ డి లా కాబ్రెరిజో, ఫాబ్రెజాన్ ప్రాంతాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు ఒక వృద్ధురాలు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. అందులో 11 మంది అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు. కొంతమంది తీవ్రంగా గాయపడగా, మరికొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ ప్రాంతాలలో అత్యవసర స్థితిని ప్రకటించింది. 2,000 మందికి పైగా అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించింది. మంటలు సగటున గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వ్యాపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గాలి వేగం, ఎండ తీవ్రత, శుష్క పరిస్థితులు మంటలు ఆపడాన్ని మరింత క్లిష్టతరం చేశాయి.
Read more: https://teluguprabha.net/international-news/is-india-facing-highest-trump-tariff/
ఈ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర ఎండలు, వర్షాభావం నెలకొన్నాయి. వర్షాలు లేకపోవడం, తేమ లేకపోవడం అగ్ని వ్యాప్తికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పు ప్రభావంతో ఈ అగ్నిప్రమాదం జరిగిందని పర్యావరణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఒకప్పుడు అగ్నిప్రమాదం సంభవించినపుడు వైన్ పొలాలు అడ్డుగా ఉండేవి. కానీ ఇటీవల భద్రతా చర్యల పేరుతో వాటి చుట్టూ ఉన్న పొదలను తొలగించడం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి.


