Saturday, February 14, 2026
Homeఇంటర్నేషనల్India-EU Free Trade: భారత్‌ యూరప్‌ మధ్య ఫ్రీ ట్రేడ్‌ ఒప్పందం.. చౌక ధరకే లభించనున్న...

India-EU Free Trade: భారత్‌ యూరప్‌ మధ్య ఫ్రీ ట్రేడ్‌ ఒప్పందం.. చౌక ధరకే లభించనున్న ఉత్పత్తులు

Free Trade Agreement Between India-EU: భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం జరిగింది. 18 ఏళ్లుగా సాగుతున్న చర్చలకు ముగింపు పలుకుతూ ఒక కీలక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఖరారైంది. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్, 2వ స్థానంలో ఉన్న యూరోపియన్ యూనియన్ కలిసి ఈ ఒప్పందాన్ని పూర్తి చేశాయి. ఈ రెండు దేశాలు కలిపి ప్రపంచ జీడీపీలో సుమారు 25 శాతం వాటాను కలిగి ఉండటం విశేషం. ఈ ఒప్పందానికి ఈ ఏడాదిలోనే సంతకం అయ్యే అవకాశం ఉందని, 2026లో అమల్లోకి వచ్చేలా చర్యలు జరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది. యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం తర్వాత ఒప్పందం అమలులోకి రానుంది.

- Advertisement -

భారత ఎగుమతులకు భారీ లాభం..

ఈ ఒప్పందం అమల్లోకి వస్తే భారత్‌ నుంచి యూరప్‌కు ఎగుమతయ్యే 99 శాతం భారత ఉత్పత్తులకు టారిఫ్‌లు ఉండవు. దీంతో, భారత ఎగుమతిదారులకు భారీ ఊరట లభించనుంది. ముఖ్యంగా టెక్స్‌టైల్స్‌, దుస్తులు, ఫుట్‌వేర్, లెదర్, సముద్ర ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, ఆటో విడిభాగాలు, ఇంజినీరింగ్ వస్తువులకు భారీ లాభం చేకూరనుంది. ప్రస్తుతం యూరప్ విధిస్తున్న 10 నుంచి 26 శాతం వరకు ఉన్న సుంకాలు పూర్తిగా తొలగనున్నాయి. అయితే, బీఫ్, చికెన్, బియ్యం, చక్కెర వంటి కొన్ని వ్యవసాయ ఉత్పత్తులను ఈ ఒప్పందం నుంచి మినహాయించారు.

మరింత చౌకగా యూరోపియన్ ఉత్పత్తులు..

ఈ ఒప్పందంతో భారత మార్కెట్‌లోకి వచ్చే యూరోపియన్ ఉత్పత్తులు మరింత చౌక ధరకే అందుబాటులోకి రానున్నాయి. యంత్రాలు, ఎలక్ట్రికల్ పరికరాలు, మెడికల్ పరికరాలు, రసాయనాలు, ప్లాస్టిక్స్, ఔషధాలు, స్టీల్ వంటి వాటిపై ఉన్న భారీ సుంకాలు తొలగించనున్నారు. లగ్జరీ కార్లపై ప్రస్తుతం 110 శాతం వరకు ఉన్న సుంకం 10 శాతానికి తగ్గనుంది. వైన్, బీర్, మద్యం వంటి వాటిపై ఉన్న సుంకాలు కూడా గణనీయంగా తగ్గుతాయి. దీంతో, ప్రీమియం యూరోపియన్ ఉత్పత్తులు భారత వినియోగదారులకు తక్కువ ధరకు లభించనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ టారిఫ్‌ల వల్ల భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. దీని వల్ల అమెరికాకు వెళ్లే భారత ఎగుమతులు 21 శాతం వరకు తగ్గాయి. ఈ పరిస్థితుల్లో భారత్-ఈయూ ఒప్పందం అమెరికాపై ఆధారాన్ని కొంత మేర తగ్గించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. యూరప్ ఇప్పటికే భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2025 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యం 136 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఒప్పందాన్ని “సామూహిక అభివృద్ధికి దారి తీసే ఒప్పందం”గా అభివర్ణించారు. ప్రపంచంలో పెరుగుతున్న అనిశ్చితి మధ్య భారత్–ఈయూ భాగస్వామ్యం అంతర్జాతీయ స్థిరత్వానికి తోడ్పడుతుందని ఆయన అన్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వాణిజ్య నిపుణుల ప్రకారం, భారత్, యూరప్ ఒకదానికొకటి పోటీ కాకుండా పరస్పరంగా పూరకంగా పనిచేస్తాయి. భారత్ ఎక్కువగా కార్మిక ఆధారిత ఉత్పత్తులు ఎగుమతి చేస్తే, యూరప్ అధునాతన సాంకేతిక పరికరాలు సరఫరా చేస్తుంది. దీంతో ఈ ఒప్పందం రెండు పక్షాలకు లాభదాయకంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ ఒప్పందం భారత్‌కు 22వ ఫ్రీ ట్రేడ్ ఒప్పందంగా నిలవనుంది. ఇప్పటికే యూఏఈ, ఆస్ట్రేలియా, యుకే, ఈఎఫ్‌టీఏ వంటి దేశాలతో భారత్ ఇలాంటి ఒప్పందాలు చేసుకుంది. తక్షణంగా అమెరికా టారిఫ్‌ల ప్రభావాన్ని పూర్తిగా తట్టుకోలేకపోయినా, మధ్యకాలంలో భారత్ ఎగుమతులకు ఈ ఒప్పందం బలంగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూరోప్ మార్కెట్‌లో భారత ఉత్పత్తులకు మరింత స్థిరమైన అవకాశాలు లభించనున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News