International pressure mounts on Israel for Gaza ceasefire : గాజాలో మానవతా సంక్షోభం చరమాంకానికి చేరిన వేళ, ప్రపంచ దేశాలన్నీ ఒక్కతాటిపైకి వస్తున్నాయి. “యుద్ధం తక్షణం ఆపండి, అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడకండి” అంటూ బ్రిటన్, జపాన్ సహా 28 దేశాలు ఇజ్రాయెల్‌కు తీవ్ర స్వరంతో చేసిన హెచ్చరిక అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. మిత్రదేశాలే ఎదురు తిరగడంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రభుత్వం ఒంటరిగా మిగిలిపోతోందా..? అసలు ఈ దేశాలు ఇంత తీవ్రంగా స్పందించడానికి కారణాలేంటి? ఇజ్రాయెల్ దీనికి ఎలా బదులిచ్చింది..?
అంతర్జాతీయ వేదికపై ఇజ్రాయెల్ ఏకాకి : గాజాపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) సాగిస్తున్న అమానవీయ దాడులతో సామాన్యుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయని ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, జపాన్ వంటి కీలక దేశాల విదేశాంగ మంత్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా, 28 దేశాలు కలిసి ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేయడం ఈ అంశం తీవ్రతకు అద్దం పడుతోంది. “గాజాలో జరుగుతున్నది యుద్ధం కాదు, మానవ హక్కుల ఉల్లంఘన. ఆహారం, నీళ్ల కోసం ఎదురుచూస్తున్న పసి పిల్లలు, మహిళలు, అమాయక ప్రజలను విచక్షణారహితంగా హతమార్చడం సభ్యసమాజం తలదించుకోవాల్సిన విషయం” అని ఆ ప్రకటనలో ఘాటుగా పేర్కొన్నారు.
ప్రమాదకరంగా సహాయక చర్యలు : ఇజ్రాయెల్ ప్రభుత్వం గాజాలో అనుసరిస్తున్న సహాయ పంపిణీ విధానం అత్యంత ప్రమాదకరంగా ఉందని, ఇది మరింత అస్థిరతకు, హింసకు దారితీస్తోందని ఆయా దేశాలు మండిపడ్డాయి. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం కార్యాలయం వెల్లడించిన గణాంకాలను ఉటంకిస్తూ… సాయం కోసం బారులు తీరిన 800 మందికి పైగా పాలస్తీనియన్లు మృత్యువాత పడటం దారుణమని పేర్కొన్నాయి. అంతర్జాతీయ మానవతా చట్టాలను గౌరవించాలని, అత్యావసర మానవతా సాయాన్ని అడ్డుకోవడం ఆమోదయోగ్యం కాదని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి స్పష్టమైన సందేశం పంపాయి.
ఇజ్రాయెల్ తిరస్కృతి – హమాస్‌పై నెపం : అయితే, ఈ 28 దేశాల సంయుక్త ప్రకటనను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఇటువంటి ప్రకటనలు హమాస్ ఉగ్రవాదులకు తప్పుడు సంకేతాలు పంపుతాయని, వారిని మరింత ప్రోత్సహించినట్లు అవుతుందని పేర్కొంది. తాత్కాలిక కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం తాము చేసిన ప్రతిపాదనను హమాస్ నిరాకరించడం వల్లే యుద్ధం కొనసాగుతోందని ఆరోపించింది. ఈ మొత్తం విధ్వంసానికి, యుద్ధం పొడిగింపునకు హమాసే మూల కారణమని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఓరెన్ మార్మోర్‌స్టెయిన్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.
చరమాంకానికి చేరిన సంక్షోభం: గత 21 నెలలుగా సాగుతున్న ఈ భీకర యుద్ధం కారణంగా గాజా కరువు కోరల్లో చిక్కుకుంది. రెండు మిలియన్లకు పైగా పాలస్తీనియన్లు నిరాశ్రయులయ్యారు. ఈ దారుణ మారణహోమంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీని తీవ్రత ఎంతగా ఉందంటే, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) ఏకంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసేంత వరకు వెళ్లింది. మే నెలలోనే బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాలు గాజాలో మారణహోమాన్ని ఆపకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాయి. ఆస్ట్రేలియా హోం వ్యవహారాల మంత్రి టోనీ బర్క్ మాట్లాడుతూ, “గాజాలో జరుగుతున్న విధ్వంసకర హత్యలు సహించలేనివి, తక్షణమే యుద్ధం ముగించి బందీలను విడుదల చేయాలి” అని డిమాండ్ చేశారు.


