Gaza humanitarian crisis : రెండు దశాబ్దాలకు పైగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ భీకర యుద్ధం గాజాను శ్మశానంగా మార్చేసింది, వేలాది ప్రాణాలను బలిగొంది. బాంబుల వర్షం, బుల్లెట్ల శబ్దాల మధ్య మానవత్వం మూగబోయింది. మరణమృదంగం మోగుతున్న వేళ, ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఇప్పటివరకు 60 వేల మందికి పైగా ప్రాణాలు గాలిలో కలిసిపోగా, లక్షల మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఘోరకలికి అంతెప్పుడు..? ఈ మారణహోమానికి ముగింపు లేదా..?
విలవిలలాడుతున్న గాజా : గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు గుండెల్ని పిండేస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా మరణించిన వారి సంఖ్య 60,034కి చేరింది. మరో 1,45,870 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో సగానికి పైగా మహిళలు, చిన్నారులే ఉండటం ఈ యుద్ధం సృష్టిస్తున్న తీవ్ర విషాదాన్ని కళ్లకు కడుతోంది. గడిచిన 24 గంటల్లోనే 113 మంది మృతి చెందగా, 637 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. అయితే, మృతుల్లో ఎంతమంది సామాన్య పౌరులు, ఎంతమంది హమాస్ యోధులు ఉన్నారనే దానిపై స్పష్టత లేదు.
ఆకలితో అలమటిస్తున్న ప్రజలు : యుద్ధం ఒకవైపు ప్రాణాలను బలి తీసుకుంటుంటే, మరోవైపు ఆకలి గాజా ప్రజలను పట్టిపీడిస్తోంది. తీవ్ర ఆహార సంక్షోభం కారణంగా ప్రజలు జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థల నివేదికల ప్రకారం గాజాలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.
తీవ్రమైన పోషకాహార లోపం: లక్షలాది మంది మహిళలు, చిన్నారులు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ‘ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్’ (IPC) నివేదిక ప్రకారం, గాజాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. తక్షణమే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున మరణాలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మే నెలలో 4.4 శాతంగా ఉన్న పోషకాహార లోపం జులై నాటికి 16.5 శాతానికి పెరిగింది.
సహాయానికి ఆటంకాలు: అంతర్జాతీయ ఒత్తిడితో ఇజ్రాయెల్ ఆంక్షలను సడలించినప్పటికీ, సహాయక చర్యలకు ఆటంకాలు తప్పడం లేదు. గాజాలోకి వచ్చే సహాయ ట్రక్కులను సాయుధ ముఠాలు దోచుకుంటున్నాయి. దీంతో సహాయక సిబ్బందికి కూడా కడుపునిండా తిండి దొరకని దయనీయ పరిస్థితి నెలకొందని ఐరాస ఆవేదన వ్యక్తం చేసింది.
హమాస్‌పై ట్రంప్ ఆగ్రహం : కాల్పుల విరమణ చర్చలు విఫలం కావడానికి హమాస్ వైఖరే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. హమాస్‌కు శాంతిపై ఆసక్తి లేదని, వారికి చావే ధ్యేయంగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. గాజాలో సైనిక చర్యను మరింత ఉధృతం చేసి, హమాస్‌ను తుదముట్టించాలని ఆయన ఇజ్రాయెల్‌కు సూచించారు.


