Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Route Cuase of Gen Z Movement: బంధాలను తెంచేశారని..ప్రభుత్వాన్నే కూలదోశారు

Route Cuase of Gen Z Movement: బంధాలను తెంచేశారని..ప్రభుత్వాన్నే కూలదోశారు

Zen G: నేపాల్‌లో సోషల్‌ మీడియాపై బ్యాన్‌ విధించడమే అక్కడి ప్రభుత్వానికి ముప్పుగా మారింది. సర్కారు నిర్ణయాన్ని తప్పుబట్టిన యువత ఆందోళన చేపట్టడమే కాదు..చివరకు ప్రభుత్వాన్ని కూలదోసే వరకు వచ్చారు. విచ్చలవిడి అవినీతిని తప్పుబట్టి, ఆగ్రహించడమే కాకుండా.. ప్రభుత్వ పెద్దల ఆస్తులను విధ్వంసం చేశారు. వారిపై భౌతికదాడులకు పాల్పడ్డారు.
ఫేస్బుక్‌, వాట్సాప్‌, ఎక్స్​​‍, యూట్యూబ్‌ తదితర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలు తమ జీవితాలకు ఎంత అవసరమనేది తమ ఆగ్రహం ద్వారా వ్యక్తం చేశారు. ఈ ఘటనతో యావత్‌ ప్రపంచ దృష్టినీ ఆకర్షించిన నేపాల్‌లో ప్రస్తుత విపత్కర పరిస్థితులకు కారణాలను పరిశీలిద్దాం.

- Advertisement -

సోషల్‌మీడియానే ఆధారం
నేపాల్‌ ప్రజలు ముఖ్యంగా యువత.. ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ భారత్‌, మలేషియాతో పాటు గల్ఫ్‍దేశాలకు వలస వెళుతుంటారు. అక్కడ పని చేసి సంపాదించిన సొమ్మును నేపాల్‌లో ఉంటున్న తమ కుటుంబాలకు పంపిస్తుంటారు. ఇలా విదేశాల్లో నేపాళీయులు సంపాదించి, తమ సొంత ప్రాంతానికి పంపిన మొత్తం నేపాల్‌ స్థూల జాతీయ ఆదాయంలో 33 శాతంగా ఉన్నది. వారంతా తమ కుటుంబసభ్యులు, మిత్రులతో మాట్లాడేందుకు, సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు ఫేస్బుక్‌, వాట్సాప్‌, ఎక్స్​​‍ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంల పైనే ప్రధానంగా ఆధారపడుతున్నారు. అవి కేవలం సాధనంగానే కాకుండా వారి జీవితంలో భాగంగా మారాయి. నేపాల్‌ ప్రభుత్వం ఆ ప్రాధాన్యాన్ని, అవసరాన్ని గుర్తించకుండా సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలను నిషేధించింది. తిరిగి అనుమతించకుండా ప్రత్యేక నిబంధనలనూ రూపొందించింది. ఇదే అక్కడి ప్రజల ఆగ్రహానికి గురి చేసింది.

ఇటు నిరుద్యోగం.. అటు లగ్జరీ లైఫ్‌
నేపాల్‌లో పేదరికం, నిరుద్యోగం పెరిగిపోతుండగా అదే సమయంలో ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు కూడా ఎక్కువయ్యాయి. అధికారంలో ఉన్న వారి పిల్లలు, రాజకీయనాయకుల సంతానం (నెపో కిడ్స్​‍) తమ తల్లిదండ్రుల అవినీతి సొమ్ముతో లగ్జరీలైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. పైగా తమ డాబు, దర్పాన్ని సోషల్‌మీడియాల్లో షేర్‌ చేశారు. ‘ఇదీ మా లైఫ్‌’ అంటూ గర్వంగా పేర్కొనడం ఇక్కడి నిరుపేదలను మరింత రెచ్చగొట్టినట్టయింది. తమ కుటుంబసభ్యులు దేశం కాని దేశంలో పనిచేస్తూ అష్టకష్టాలు పడుతుంటే నేతల పిల్లలు మాత్రం కులుకుతున్నారని యువత రగిలిపోయింది. వీటికితోడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపాల్‌ అధికార, ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా లోపాయికారీ ఒప్పందం జరిగినట్లు ప్రజలు అనుమానించారు. అవినీతిపరులే అధికారం చెలాయిస్తున్నారని మండిపడ్డారు.

వలసలతో ఆదాయం.. సమస్య కూడా
నేపాల్‌ జనాభా మొత్తం 3 కోట్లు. 16 -నుంచి 25 ఏళ్ల వయసు గల యువత 20 శాతం. 16 నుంచి -40 ఏళ్ల మధ్య వయసున్న వారు 40 శాతంగా ఉంటారు. కఠ్మాండూలోని సెంటర్‌ ఫర్‌ సౌత్‌ ఏషియన్‌ స్టడీస్ పరిశోధకులు అషియాన అధికారి అందించిన వివరాల ప్రకారం.. గత పదేళ్లుగా ఇక్కడి యువత విద్య, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్తున్నారు. విదేశాల్లో పని చేస్తూ తమ సంపాదనను కుటుంబాలకు పంపడం ద్వారా ఆ దేశ స్థూల దేశీయోత్పత్తికి ఆధారమవుతున్నారు. మరోవైపు వివిధ రంగాల్లోని ప్రొఫెషనల్స్​‍ విదేశాల్లో స్థిరపడటం వల్ల వారి కుటుంబాలు స్థానికంగా వ్యవసాయానికి దూరమయ్యాయి. దీంతో సాగుతో పాటు దాని అనుబంధ రంగాలు కూడా కుంటుపడ్డాయి. ఆహార ఉత్పత్తులు, ఇతర వస్తువుల కోసం ఇతర దేశాలపై ఆధారపడటం అనివార్యమైంది. వలస వెళ్లినవారి నుంచి డబ్బులు వస్తున్నందున వారి కుటుంబీకులు పని చేయడానికి బద్దకిస్తున్నారు. ఇది మరో సమస్యగా మారింది.

తగ్గిన తలసరి ఆదాయం
ప్రపంచబ్యాంకు అంచనాల ప్రకారం, తలసరి ఆదాయంతో పాటు కొనుగోలు శక్తిస్థాయిలు కూడా గణనీయంగా తగ్గాయి. నేపాల్‌ ఆర్థికంగా మెరుగుపడకపోవడమే కాకుండా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయిలో కూడా లేదు. రాజకీయ సంక్షోభాలు, ప్రభుత్వాల అవినీతి, అధికారంలో, రాజకీయాల్లో ఉన్నవారిలో బంధుప్రీతి పెరగడం, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయకపోవడంతో 1996–2023 మధ్య సగటు వార్షిక వాస్తవ వృద్ధి రేటు 4.2శాతానికి తగ్గింది. రవాణా, లాజిస్టిక్స్​​‍లో మందగమనం, మౌలిక వసతుల విషయంలో వెనుకబాటుతనం, ఎగుమతుల్లో ఆశించినంత వృద్ధి లేకపోవడం, కార్మిక ఉత్పాదకత చాలా తక్కువగా ఉండడం సంక్షోభానికి కారణంగా మారుతూ వచ్చాయి. పైగా అమెరికా విధించిన పన్నుపోటుతో ఎగుమతులు తగ్గిపోవడం, తయారీరంగం క్షీణదశకు చేరుకోవడం అగ్నికి ఆజ్యం పోసినంత పనిచేశాయి. పర్యాటకం, జలవిద్యుత్‌ రంగాలు అంతంత మాత్రంగా మారడం… వెరసి జెన్‌- జీ ఉద్యమానికి బీజం వేశాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad