Generational Ban On Tobacco in Maldives: తమ దేశంలో పొగాకు వినియోగాన్ని నియంత్రించే దిశగా చర్యలు చేపట్టిన మాల్దీవులు ప్రభుత్వం.. తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని నేటి నుంచి అధికారికంగా అమలు చేసింది. మాల్దీవులులో ‘ఒక తరానికి నిషేధం’ విధిస్తూ పొగాకు నియంత్రణ చట్టానికి కీలక సవరణలు చేసింది. ఈ నూతన చట్టం ప్రకారం ఆ దేశంలో నిర్దిష్ట సంవత్సరం తర్వాత జన్మించిన వారికి పొగాకు వాడకం, విక్రయంపై జీవితకాలం నిషేధం ఉంటుంది.
Also Read: https://teluguprabha.net/international-news/trump-announces-resumption-of-u-s-nuclear-testing/
మాల్దీవులులో పొగాకు నియంత్రణ చట్టం కొత్త నిబంధనల ప్రకారం.. 2007 జనవరి 1వ తేదీ లేదా ఆ తర్వాత జన్మించిన వారికి.. పొగాకు ఉత్పత్తులను వినియోగించడంపై నిషేధం ఉంటుంది. అదేవిధంగా 21 ఏళ్లలోపు వయసున్న వారికి లేదా ఈ తరం నిషేధం పరిధిలోకి వచ్చేవారికి పొగాకు ఉత్పత్తులను విక్రయించడం కూడా చట్టవిరుద్ధం. ఈ నూతన చట్టంతో పాటు దేశవ్యాప్తంగా ఈ-సిగరెట్లు, వేపింగ్ ఉత్పత్తులు, వాటికి సంబంధించిన ఉపకరణాల వాడకం, దిగుమతి, తయారీ, కలిగి ఉండటంపై కూడా మాల్దీవులు ప్రభుత్వం సంపూర్ణ నిషేధం విధించింది.
దేశంలో సమర్థులైన, నైతిక విలువలు కలిగిన, శ్రద్ధగల పౌరులను తీర్చిదిద్దాలన్న అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు దార్శనికతకు అనుగుణంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు అక్కడి ప్రభుత్వ మీడియా సంస్థ తెలిపింది. కాగా, గతేడాది డిసెంబరులోనే వేపింగ్ పరికరాల వాడకం, అమ్మకాలపై మాల్దీవుల ప్రభుత్వం నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా వేపింగ్ పరికరాలను దిగుమతి చేస్తే వారికి 50,000 మాల్దీవియన్ రుఫియాల (సుమారు 3,250 అమెరికన్ డాలర్లు) జరిమానా తప్పదు. ఇక, వీటితో పాటు మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు కూడా మాల్దీవుల ప్రభుత్వం తన ప్రయత్నాలను తీవ్రతరం చేసింది.
కాగా, ఇటీవల పొరుగు దేశమైన శ్రీలంక కూడా అక్రమంగా దిగుమతి చేసుకున్న రూ. 1.2 బిలియన్ల విలువైన విదేశీ సిగరెట్లను ధ్వంసం చేయడం సంచలనం సృష్టించింది. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనతో పాటు పొగాకు నిషేధంపై ఆయా దేశాలు చూపుతున్న నిబద్ధత తమ పౌరుల పట్ల బాధ్యతను తెలియజేస్తుంది. ఇలాంటి కఠిన చట్టాలు భారత్‌లోనూ అమలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


