Robbery in California Gold Shop: అమెరికాలోని కాలిఫోర్నియాలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఏకంగా 25 మంది దుండగులు ఒక్కసారిగా బంగారం షాపులోకి చొరబడి అందిన కాడికి దోచుకుపోయారు. ఈ నెల 22న మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాలిఫోర్నియాలోని హెల్లెర్ జ్యువెలరీ షాపులో భారీ దొంగతనం జరిగింది. ఒకేసారి 25 మంది దొంగలు ఆయుధాలను చేతపట్టుకుని నగల షాప్‌లోకి చొరబడ్డారు. అది చూసిన షాపు సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురి కాగా… వారి చేతుల్లో ఉన్న ఆయుధాలను చూసి భయపడ్డారు. అదును చూసుకున్న దుండగులు తమ దగ్గర ఉన్న సుత్తెలు, గడ్డపారలు వంటి మారణాయుధాలతో షాపును మొత్తం ధ్వంసం చేసి.. షాప్‌లో ఉన్న బంగారం మొత్తం దోచుకొని అక్కడి నుంచి పారిపోయారు. లగ్జరీ రోలెక్స్ వాచ్‌లతో పాటు ఖరీదైన నగలను దుండగులు ఎత్తుకెళ్లారు.
జ్యువెలరీ స్టోర్‌లోని సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డు కాగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దుండగులు పారిపోయిన కాసేపటికే షాప్ యజమాని పోలీసులకు సమాచారం అందించగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనలో సుమారు రూ. 9 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు.
Also Read: https://teluguprabha.net/international-news/trump-pak-pm-meet/
సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించారు. మొత్తం 25 మందిలో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేశారు. దుండగుల నుంచి కొంతవరకు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, కాలిఫోర్నియాలో రెండేళ్లలో జ్యువెలరీ షాప్‌లను లక్ష్యంగా చేసుకుని జరిగిన దోపిడీల్లో ఇది రెండో అతిపెద్ద దోపిడీగా పోలీసులు తెలిపారు. 2023లో, ఏడుగురు ముసుగు ధరించిన వ్యక్తులు సెయింట్ పాట్రిక్స్ డే రోజున ఇదే రీతిలో ఒక నగల షాప్‌లోకి చొరబడి కోట్ల విలువైన ఆభరణాలను దోచుకున్నట్టు వివరించారు.


