Monday, February 16, 2026
Homeఇంటర్నేషనల్Grammy 2026: గ్రామీ వేదికపై రాజకీయ రణరంగం.. ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తారల నిరసన!

Grammy 2026: గ్రామీ వేదికపై రాజకీయ రణరంగం.. ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తారల నిరసన!

Donald Trump: అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఆ దేశ వినోద పరిశ్రమలో పెను సంచలనానికి దారితీస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం మిన్నియాపాలిస్ కేంద్రంగా చేపట్టిన వలసదారుల సామూహిక బహిష్కరణ (Mass Deportation) చర్యలు, హాలీవుడ్ , సంగీత ప్రపంచాన్ని ఒక్కతాటిపైకి తెచ్చాయి. కళాకారులు కేవలం వినోదానికే పరిమితం కాకుండా, ప్రభుత్వ అణిచివేత ధోరణికి వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన ‘సాంస్కృతిక తిరుగుబాటు’ను ప్రారంభించారు. ఈ నిరసన సెగలు ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల వేదికపై స్పష్టంగా కనిపించాయి.

- Advertisement -

Harish Rao: ఫోన్ ట్యాపింగ్ అంశంపై సజ్జనార్ ట్వీట్‍.. ఆగ్రహం వ్యక్తం చేసిన హరీశ్ రావు!

గ్రామీ వేదికపై ఎగసిన నిరసన సెగలు

సంగీత ప్రపంచంలో అత్యున్నత పురస్కారాలైన గ్రామీ అవార్డుల రెడ్ కార్పెట్ ఈసారి కేవలం గ్లామర్‌కే పరిమితం కాలేదు. అమెరికాలోని వలస , కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారుల దూకుడును నిరసిస్తూ సంగీత తారలు వినూత్నంగా తమ గళాన్ని వినిపించారు. “ICE OUT” అని రాసి ఉన్న ప్రత్యేకమైన పిన్‌లను తమ ఖరీదైన దుస్తులపై ధరించి, ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తున్నట్లు ప్రపంచానికి చాటిచెప్పారు. ముఖ్యంగా మెక్సికన్ అమెరికన్ గాయని బెక్కి జి తన గోళ్లపై (Nails) నేరుగా ఐస్ అధికారులను విమర్శిస్తూ రాసుకున్న సందేశం అందరినీ ఆకట్టుకుంది. అలాగే జోని మిచెల్ వంటి దిగ్గజాలు అవార్డు అందుకునే సమయంలోనూ ఈ నిరసన పిన్‌లను ధరించి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

ప్రజాగ్రహానికి కారణమైన దుర్ఘటనలు

అమెరికా వీధుల్లో ఐస్ అధికారులు ప్రదర్శిస్తున్న తీరుపై గత కొంతకాలంగా సామాన్య ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బార్డర్ పెట్రోల్ అధికారుల కాల్పుల్లో 37 ఏళ్ల నర్సు అలెక్స్ ప్రెట్టి ప్రాణాలు కోల్పోవడం, ఐదేళ్ల పసివాడు లియామ్ కొనెజో రామోస్‌ను ఫెడరల్ ఏజెంట్లు నిర్బంధించడం వంటి ఘటనలు ఈ నిరసనలకు ప్రధాన కారణమయ్యాయి. వీటికి తోడు జర్నలిస్ట్ డాన్ లెమన్‌ను అరెస్టు చేయడం కూడా ఈ ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే గ్రామీల వంటి వేదికలను వాడుకుని, వీధుల్లో పోరాడుతున్న ప్రజలకు తాము అండగా ఉన్నామని కళాకారులు నిరూపిస్తున్నారు.

నటాలీ పోర్ట్‌మన్, ఒలివియా వైల్డ్ ఆవేదన

గ్రామీల కంటే ముందే సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా పలువురు హాలీవుడ్ స్టార్స్ తమ నిరసనను వ్యక్తం చేశారు. తన కొత్త సినిమా ‘ది గ్యాలరిస్ట్’ ప్రీమియర్ లో పాల్గొన్న నటాలీ పోర్ట్‌మన్, ఐస్ అధికారుల చర్యలను తలచుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. దేశంలో జరుగుతున్న ఈ దారుణాలను విస్మరించడం ఎవరికీ సాధ్యం కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరో నటి, దర్శకురాలు ఒలివియా వైల్డ్ మాట్లాడుతూ, ప్రజలు న్యాయం కోసం రోడ్లపై పోరాడుతున్నప్పుడు, తాము ఇక్కడ ఉత్సవాలు చేసుకోవడం కష్టంగా ఉందని, తమకున్న ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ అన్యాయాన్ని ఎండగడతామని స్పష్టం చేశారు.

అడ్డంకులు , భద్రతా సవాళ్లు

కళాకారులు ఇలా బహిరంగంగా స్పందించడం వెనుక అనేక సవాళ్లు దాగి ఉన్నాయి. గ్రామీ అవార్డులను ప్రసారం చేసే సిబిఎస్ (CBS) నెట్‌వర్క్ యజమానులు ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతుండటంతో, కళాకారులపై కార్పొరేట్ ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. రికార్డింగ్ కంపెనీలు, మేనేజర్లు కూడా తమ వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి నిరసనలను అడ్డుకోవాలని చూస్తున్నారు. వీటికి తోడు, వలసదారుల కుటుంబాల నుండి వచ్చిన కళాకారులకు వ్యక్తిగత భద్రత , పౌరసత్వ సంబంధిత ముప్పులు కూడా పొంచి ఉన్నాయి. అయినప్పటికీ, భయాన్ని వీడి కళాకారులు సాగిస్తున్న ఈ పోరాటం అమెరికాలో ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీస్తోంది.

Deepika Padukone: నా లోకమంతా దువానే.. కూతురు గురించి దీపికా ఆసక్తికర వ్యాఖ్యలు.!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News