H-1B Visa Rules Change : హెచ్1బీ వీసా నిబంధనలు మారుస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠిన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల వాటి ఫీజును 215 డాలర్ల నుంచి లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకోవడం భారతీయ టెక్ నిపుణులు, కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపింది. తాజాగా అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2026 ఫిబ్రవరికి ముందే ఆ వీసాల జారీ ప్రక్రియలో గణనీయమైన మార్పులు ఉంటాయని వెల్లడించారు. పాత విధానంలో లోపాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. హెచ్-1బీ వీసాపై విధించిన లక్ష డాలర్ల రుసుము వార్షిక ఫీజు కాదని, దరఖాస్తు చేసుకొనే సమయంలో కట్టాల్సిన వన్‌టైమ్ ఫీజు మాత్రమేనని ఆయన స్పష్టతనిచ్చారు. ఈ వన్‌టైమ్ లక్ష డాలర్ల రుసుము ఇకపై కొత్తగా హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేసుకునేవారికే అమలుచేస్తామని, ప్రస్తుత వీసాదారులకు, రెన్యూవల్కు వర్తించదని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘2026 నుంచి ఈ ప్రక్రియ అంతా అమల్లోకి వస్తుంది. నా అంచనా ప్రకారం ఇప్పుడు.. 2026లో గణనీయమైన మార్పులు ఉంటాయి’’ అని పేర్కొన్నారు. లక్ష డాలర్ల ఫీజు కారణంగా రానున్న రోజుల్లో హెచ్1బీ వీసాపై వచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గుతుందన్నారు. కంపెనీలు కేవలం అత్యంత నైపుణ్యం గల ఉద్యోగులను మాత్రమే నియమించుకుంటాయని తెలిపారు. అంతేకాదు, ఈ విధానంతో అమెరికన్లకు భారీగా లాభం చేకూరుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ విధానంలో కూడా మార్పులు ఉండొచ్చని వ్యాఖ్యలు చేశారు. ఒక దేశం లాటరీ ద్వారా నైపుణ్యం కలిగిన కార్మికులను తెచ్చుకోవడం ఏంటని ప్రశ్నించారు. పాత వీసా విధానంలో లోపాలున్నాయని, ఫలితంగా అనుభవం లేని టెక్ కన్సల్టెన్సీలు దేశంలో కుటుంబాలతో సహా ప్రవేశించాయని అసంతృప్తి వ్యక్తంచేశారు.
లాటరీ విధానంలోనూ మార్పులు..
నిపుణులైన కార్మికులు మాత్రమే దేశంలోకి వచ్చేలా అమెరికా (USA) ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. హెచ్-1బీ ఎంపిక ప్రక్రియలో ప్రస్తుతం అవలంభిస్తున్న లాటరీ విధానాన్ని మార్చాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ భావిస్తోంది. అధిక నైపుణ్యం గల విదేశీయులను మాత్రమే నియమించుకోవడం, అమెరికన్లకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో వీటిని రూపొందించినట్లు తెలుస్తోంది. ఉద్యోగి వేతనస్థాయిని అనుసరించి రిజిస్ట్రేషన్‌లో ప్రాధాన్యం కల్పించడం, వేతన వర్గీకరణ (ఒకటి నుంచి నాలుగు) ఆధారంగా దరఖాస్తులను విభజించడం వంటి చర్యలు తీసుకోనున్నారు.
వీసాలపై అమెరికా కాంగ్రెస్‌లో మరో బిల్లు..
హెచ్-1బీ, ఎల్-1 వీసాల్లో మార్పులు చేయాలని, విదేశీ ఉద్యోగుల నియామకం విషయంలో కఠిన నిబంధనలు ఉండాలని పలువురు యూఎస్ సెనెటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు సెనెటర్లు చక్ గ్రాస్లీ, డిక్ డర్బిన్ బిల్లును ప్రవేశపెట్టారు. కార్పొరేట్ దుర్వినియోగాన్ని అరికట్టి అమెరికా ఉద్యోగులను రక్షించడమే లక్ష్యమని ఈ సందర్భంగా వారు వెల్లడించారు.


