Earthquake In Indonesia: ఇండోనేషియాలో మరోసారి ప్రకృతి తన భయంకర రూపాన్ని చూపించింది. తూర్పు మలుకు ప్రాంతంలో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.7 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం జనాల్లో భయాందోళనకు కారణమైంది. అమెరికా భూగర్భ పరిశోధన సంస్థ (US Geological Survey – USGS) ప్రకారం, భూకంప కేంద్రం తువాల్ నగరానికి పశ్చిమాన 177 కిలోమీటర్ల దూరంలో, భూమికి 80 కిలోమీటర్ల లోతులో నమోదైనట్లు తెలిపింది.
ఈ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై తమ ఇళ్ల నుంచి రోడ్డుపైకి పరుగులు తీశారు. కొన్ని భవనాలు బలహీనపడినట్టు సమాచారం. అయితే ఇప్పటి వరకు ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం గురించి స్పష్టమైన వివరాలు ఇంకా అందలేదు. ఇంతటి తీవ్రత ఉన్నప్పటికీ, పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ప్రస్తుతం సునామీ ప్రమాదం లేదని స్పష్టం చేసింది. అధికార యంత్రాంగం పరిస్థితిని సమీక్షిస్తూ, అవసరమైన సహాయ చర్యలు చేపడుతోంది.


