Alaska Meeting: రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చి, యుద్ధాన్ని ముగిస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ చేస్తానని మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ అన్నారు. అయితే ఆమె దానికి ఒక షరతు పెట్టారు. దాని ప్రకారం, ఆ ఒప్పందంలో ఉక్రెయిన్ తన భూభాగాన్ని వదులుకోవాల్సిన అవసరం ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు.
ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అలస్కాలో సమావేశం కానున్న నేపథ్యంలో హిల్లరీ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. “నిజాయితీగా చెప్పాలంటే, ట్రంప్ ఈ భయంకరమైన యుద్ధాన్ని ముగించగలిగితే, ఉక్రెయిన్ తన భూభాగాన్ని ఆక్రమదారుడికి అప్పగించాల్సిన అవసరం లేకుండానే పరిష్కారాన్ని తీసుకురాగలిగితే, నేను అతన్ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తాను,” అని హిల్లరీ ఒక పాడ్‌కాస్ట్‌లో చెప్పారు.
పుతిన్‌కు లొంగిపోకుండా ఉండటమే తన లక్ష్యమని హిల్లరీ తెలిపారు. ఈ ప్రకటనను ఆమె తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. “డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ తన భూభాగాన్ని వదులుకోకుండా పుతిన్ యుద్ధాన్ని ముగిస్తే, నేను అతన్ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తాను,” అని ఆమె రాశారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కూడా ఈ యుద్ధాన్ని ఆపాలని, ఈ విషయంలో అమెరికాపై తమకు నమ్మకం ఉందని తెలిపారు. ట్రంప్-పుతిన్ సమావేశంలో యుద్ధాన్ని నిలిపివేయడంపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ట్రంప్ తన అధ్యక్ష పదవిలో నోబెల్ శాంతి బహుమతి సాధించాలని ఆశపడ్డారని, ఇప్పుడు దానిని సాధించేందుకు ఆయనకు ఇది ఒక సువర్ణావకాశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


