Friday, November 22, 2024
Homeఇంటర్నేషనల్Honey bees losing smell: వాస‌న శ‌క్తి కోల్పోతున్న తేనెటీగ‌లు

Honey bees losing smell: వాస‌న శ‌క్తి కోల్పోతున్న తేనెటీగ‌లు

(తెలుగుప్ర‌భ ప్ర‌త్యేక ప్ర‌తినిధి)
తేనెటీగ‌లు… ఇవి ఆహార‌భ‌ద్ర‌త‌కు చాలా కీల‌కం. ఎందుకంటే, తేనెను వెతుక్కునే క్ర‌మంలో ఒక్కో పువ్వు మీద ఇవి వాలుతుంటాయి. అప్పుడు వాటి కాళ్ల‌కు పుప్పొడి అంటుకుని, ఒక పువ్వు నుంచి మ‌రో పువ్వు మీద‌కు అది వ్యాపిస్తుంది. త‌ద్వారా ప‌ర‌ప‌రాగ సంప‌ర్కం జ‌రిగిన త‌ర్వాత‌ పూలు… కాయ‌లుగాను, పండ్ల‌గాను రూపొందుతాయి. ఈ మొత్తం ప్ర‌క్రియ‌లో తేనెటీగ‌లు, ఇత‌ర కీట‌కాలు చాలా కీల‌క‌పాత్ర పోషిస్తాయి. ఇదంతా స‌ర్వ‌సాధార‌ణంగా జ‌రిగిపోయే ప్ర‌క్రియ‌. కానీ.. ఇప్పుడు ఆ ప‌రిస్థితి మారిపోతోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్ర‌త‌ల కార‌ణంగా చాలార‌కాల తేనెటీగ‌లు వాస‌న పీల్చే శ‌క్తిని కోల్పోతున్నాయట‌. దానివ‌ల్ల అవి తేనె ఎక్క‌డ ఉంటుందో గుర్తుపట్ట‌లేక‌.. పువ్వుల మీద వాల‌వు. అలా వాల‌క‌పోతే ప‌ర‌ప‌రాగ సంప‌ర్కం జ‌ర‌గ‌దు. ఫ‌లితంగా కాయ‌లు, పండ్లు కాయ‌వు. ఇదంతా క‌లిసి ఆహార భ‌ద్ర‌త మీద చాలా తీవ్ర‌మైన దుష్ప్ర‌భావం చూపిస్తుంద‌ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌ర్యావ‌ర‌ణ శాస్త్రవేత్త‌లు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

- Advertisement -

న‌గ‌రీక‌ర‌ణ విచ్చ‌ల‌విడిగా పెరిగిపోవ‌డం, వ్య‌క్తిగ‌త వాహ‌నాల సంఖ్య ఇబ్బ‌డిముబ్బ‌డి కావ‌డం, పారిశ్రామికీక‌ర‌ణ ఎక్కువ కావ‌డం.. ఇవ‌న్నీ క‌లిసి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉష్ణోగ్ర‌త‌ల‌ను విప‌రీతంగా పెంచేశాయి. అంతులేని ఉష్ణోగ్ర‌త‌ల కార‌ణంగా తేనెటీగ‌లు ఆఘ్రాణ‌శ‌క్తి (వాస‌న పీల్చే సామ‌ర్థ్యం) కోల్పోతున్నాయ‌ని రాయ‌ల్ సొసైటీ ఆఫ్ సైన్స్‌, ఇత‌ర సంస్థ‌ల‌కు చెందిన శాస్త్రవేత్త‌లు ఆందోళ‌న చెందుతున్నారు. ఫ్రాన్స్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ అగ్రిక‌ల్చ‌ర‌ల్, ఫుడ్ అండ్ ఎన్విరాన్‌మెంట‌ల్ రీసెర్చ్‌కి చెందిన ఫీల్డ్ ఇకాల‌జిస్టు కొలిన్ జ‌వోర్‌స్కీ మాట‌ల్లో చెప్పాలంటే, “ఈ ప‌లితాలు చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. వ‌డ‌గాలుల ప్ర‌భావం తేనెటీగ‌ల శ‌రీర నిర్మాణం, వాటి ఆఘ్రాణ శ‌క్తి మీద చాలా దారుణంగా ప‌డుతోంది. ఇది క‌చ్చితంగా ఆహార భ‌ద్ర‌త మీద కూడా త‌న ప్ర‌భావం చూపిస్తుంది” అని అంటున్నారు. వాతావ‌ర‌ణ కాలుష్యం, భూతాపం, పెరిగిపోతున్న ఉష్ణోగ్ర‌త‌ల కార‌ణంగా ప‌ర‌ప‌రాగ ప్ర‌క్రియ‌కు దెబ్బ ప‌డుతోంది. కాలుష్యం అతి కొద్దిస్థాయిలో ఉన్నా కూడా ఆసియా తేనెటీగ‌ల్లో 80% వ‌ర‌కు చ‌నిపోతాయ‌ని శాస్త్రవేత్త‌లు ఇటీవ‌ల చేసిన ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.

అపి్ డొర్సాటా అనే శాస్త్రీయ‌నామం క‌లిగిన భారీ ఆసియా తేనెటీగ‌లుమ‌న దేశంలో ప‌ర‌ప‌రాగ సంప్క‌రంలో బాగా పాలుపంచుకుంటాయి. పెద్ద పెద్ద న‌గ‌రాల్లోనూ భారీ భ‌వ‌నాలకు తేనెప‌ట్లు ప‌ట్టిన‌ప్పుడు వాటిమీద ఈ తేనెటీగ‌లు క‌నిపిస్తాయి. ప్ర‌పంచంలోనే కూర‌గాయ‌ల ఉత్ప‌త్తిలో మ‌న దేశం రెండో స్థానంలో ఉంది. 2016లో 300 కోట్ల డాల‌ర్ల విలువైన పండ్ల‌ను ఇక్క‌డ ఉత్ప‌త్తి చేశారు. అలాంటిది, ఇప్పుడు క్ర‌మంగా వీటి ఉత్ప‌త్తి ప‌డిపోవ‌డానికిప్ర‌ధాన కార‌ణం… తేనెటీగ‌లు, ఇత‌ర కీట‌కాల సంత‌తి త‌గ్గిపోవ‌డ‌మే. దీనిపై బెంగ‌ళూరులోనూ కొంత‌కాలం క్రితం ప‌రిశోధ‌న‌లు జ‌రిగాయి.

వాతావ‌ర‌ణ కాలుష్యం, వేడి గాలులు.. ఈరెండూ తేనెటీగ‌ల పాలిట మ‌ర‌ణ‌శాస‌నంగా మారాయి. వాటి శ‌రీరాలు అత్యంత సున్నితంగా మారిపోయాయి. తేనెటీగ‌ల శ‌రీర నిర్మాణం చాలా విభిన్నంగా ఉంటుంది. వాటి బాహ్య‌కోశంతోనే అవి గాలి పీల్చుకుంటాయి. శ‌రీరంలో నీరు న‌ష్ట‌పోకుండా చూసుకుంటాయి. ఆల‌సియ‌లోనే అతిపెద్ద పారిశ్రామిక‌వాడ‌ల్లో ఒక‌టైన పీన్యా ప్రాంతంలోని తేనెటీగ‌ల‌ను సేక‌రించి, వాటిని మైక్రోస్కోప్‌లో ప‌రిశీలిస్తే.. వాటి శ‌రీరాల మీద ఆర్సెనిక్, సీసం లాంటి భార‌లోహాల‌తో పాటు అనేక విష‌ప‌దార్థాలు పేరుకుపోయిన‌ట్లు తేలింది. అలాంటి ప్రాంతాల నుంచి తెచ్చిన తేనెటీగ‌ల్లో 90 శాతం తెచ్చిన మ‌ర్నాడే చ‌నిపోయాయి. వేడి గాలులు, కాలుష్యం వ‌ల్ల గుండె ప‌నితీరు మంద‌గించ‌డం, వాటి ర‌క్త‌క‌ణాల స్థాయి త‌గ్గిపోవ‌డం, రోగ‌నిరోధ‌క శ‌క్తి బ‌ల‌హీన‌ప‌డ‌టం లాంటి ల‌క్ష‌ణాలూ క‌నిపించాయి. కాలుష్యం కాటుకు గుర‌వుతున్న తేనెటీగ‌ల క‌ద‌లిక‌లు త‌గ్గిపోతున్నాయి. దీనివ‌ల్ల ప‌ర‌ప‌రాగ సంప‌ర్కంపై ప్ర‌భావం ప‌డి.. కూర‌గాయ‌లు, పండ్ల ఉత్ప‌త్తి శ‌ర‌వేగంగా ప‌డిపోతోంది. అన్నిర‌కాల పంట‌ల్లో 70% వ‌ర‌కు ప‌ర‌ప‌రాగ సంప‌ర్కం కోసం కీట‌కాల మీదే ఆధార‌ప‌డ‌తాయి. కానీ, ఇది త‌గ్గిపోతే ఒక్క మామిడిపండ్ల దిగుబ‌డి 53 శాతం ప‌డిపోయి, మ‌న దేశం 8.6 కోట్ల డాల‌ర్ల ఎగుమ‌తుల ఆదాయం కోల్పోతుంది.

ఈ త‌ర‌హా ప‌రిస్థితి కేవ‌లం న‌గ‌రాల్లోనే కాదు.. ప‌ల్లెల్లో కూడా క‌నిపిస్తోంది. గ్రామాల్లో కూడా ట్రాక్ట‌ర్లు, టిప్ప‌ర్లు, లారీలు పెద్ద సంఖ్య‌లో తిరుగుతున్నాయి. అక్క‌డ కూడా మొక్క‌ల పెంప‌కం త‌గ్గిపోయి త‌ద్వారా ఉష్ణోగ్ర‌త‌లు పెరిగిపోతున్నాయి. ఏసీల వాడ‌కం ఎక్కువైపోవ‌డంతో వాటి నుంచి వెలువ‌డే వేడి కూడా వాతావ‌ర‌ణంలో క‌లుస్తోంది. వాహ‌నాల నుంచి వ‌చ్చే డీజిల్ వాస‌న తేనెటీగ‌లు, ఇత‌ర కీట‌కాల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తోంది! సాధార‌ణంగా మ‌నుషుల కంటే కీట‌కాల‌కు వాస‌న పీల్చే శ‌క్తి 10 ల‌క్ష‌ల రెట్లు ఎక్కువ‌. పూల నుంచి వ‌చ్చే వాస‌న‌ను గుర్తుప‌ట్ట‌డం వ‌ల్లే అవి అటువైపు వెళ్తాయి. కానీ వేడిగాలులు, కాలుష్యం కార‌ణంగా వాటి ఆఘ్రాణ‌శ‌క్తి దెబ్బ‌తిని, పూల వాస‌న‌ను గుర్తించలేని స్థితికి వెళ్లిపోతున్నాయ‌ని బెంగ‌ళూరులోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండ‌మెంట‌ల్ రీసెర్చికి చెందిన ప్రొఫెస‌ర్లు చెబుతున్నారు. 1980 నుంచి 2013 మ‌ధ్య‌నే బ్రిట‌న్‌లో 353 జాతుల‌కు చెందిన తేనెటీగ‌లు పూర్తిగా అంత‌రించిపోయాయి. గ‌త సంవ‌త్స‌రం ప్ర‌పంచంలోనే అత్యంత వేడి సంవ‌త్స‌రంగా న‌మోదైంది. వాతావ‌ర‌ణ‌మార్పు వ‌ల్ల వ‌డ‌గాలులు పెరిగాయి. ఈ వ‌డ‌గాలుల వ‌ల్లే అత్యంత సున్నిత‌మైన తేనెటీగ‌లు అంత‌రించిపోతున్నాయి. ఈ ప‌రిణామాన్ని వీలైనంత త్వ‌ర‌గా అడ్డుకోలేక‌పోతే.. ఇక ప్ర‌పంచంలో ఆక‌లి కేక‌లు వినిపించే కాలం మ‌రెంతో దూరంలో లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News