Hongkong Fire Accident Update: హాంకాంగ్ హైరైజ్ టవర్లలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం భయపెడుతోంది. 7 టవర్లు మంటల్లో ఆహుతవడంతో హైదరాబాద్ హైరైజ్ టవర్ల భద్రతపై ప్రశ్నలు విన్పిస్తున్నాయి. ఇవి ఎంతవరకు సేఫ్ అనే సందేహం వస్తోంది. భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే అనుమానం కలుగుతోంది. ఆ వివరాలు మీ కోసం..
హాంకాంగ్‌లోని వాంగ్‌ఫుక్ కోర్ట్ కాంప్లెక్స్ టవర్లలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం వందేళ్లలో అతి పెద్ద ప్రమాదంగా నిలిచింది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 94 మంది మృత్యువాత పడగా 50-60 మంది గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. వీరిలో 10-15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మరో 300 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వీరంతా ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఇంకా తెలియలేదు. అగ్ని ప్రమాదానికి కారణమేంటనేది కచ్చితంగా తెలియకపోయినా మంటల తీవ్రత పెరగడానికి మాత్రం చాలా కారణాలు కన్పిస్తున్నాయి.
వాంగ్‌ఫుక్ కోర్ట్ కాంప్లెక్స్ నేపధ్యం
ఈ కాంప్లెక్స్ 1983లో నిర్మితమైంది. మొత్తం 8 టవర్లు ఉన్నాయి. ఒక్కో టవర్‌లో 31 అంతస్థులున్నాయి. మొత్తం 8 టవర్లలో కలిపి 1984 ఫ్లాట్స్ ఉండగా మొత్తం 4600 మంది నివసిస్తున్నారు. వీరిలో 40 శాతం మంది 65 ఏళ్లు పైబడినవారే కావడం గమనార్హం.
మంటల తీవ్రతకు కారణాలేంటి Hongkong Fire Issue Reasons
దాదాపు 375 కోట్ల ఖర్చుతో ఈ టవర్లకు మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. దాంతో ప్రతి టవర్ చుట్టూ వెదురు కర్రలతో ఫెన్సింగ్ కట్టి, ప్లాస్టింగ్ నెట్, గ్రీన్ మ్యాట్ చుట్టేశారు. అదే సమయంలో మరమ్మత్తు పనుల కారణంగా దుమ్ము ధూళి, శబ్దకాలుష్యం లేకుండా ఉండేందుకు ప్రతి ఫ్లాట్ కిటికీలను స్టీరోఫోమ్ ఫ్రేమ్స్‌తో బిగించారు. అటు వెదురు కర్రలు, ఇటు స్టీరోఫోమ్ ఫ్రేమ్స్ కారణంగా మంటల తీవ్రత పెరిగిపోయింది. హైరైజ్ టవర్లు కావడంతో పైకెళ్లే కొద్దీ మంటలు తీవ్రమయ్యాయి. దీనికితోడు చుట్టూ వెదురుకర్రల ఫెన్సింగ్, గ్రీన్ మ్యాట్ ఉండటంతో ఫైర్ ట్రాప్‌గా మారి తప్పించుకునేందుకు ఆస్కారం తగ్గిపోయింది. ఇదే మరమ్మత్తు పనుల కారణంగా ఫైర్ అలార్మ్ ఆపేశారని తెలుస్తోంది. దాంతో ప్రాణ నష్టం పెరిగిపోయింది.
హైదరాబాద్ హైరైజ్ టవర్లు ఎంతవరకు సేఫ్ How much Hyderabad High Rise Tower are safe
గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో హైరైజ్ టవర్ల నిర్మాణం పెరిగిపోయింది. 2014 నుంచి హైదరాబాద్‌లో స్కై టవర్లు భారీగా వెలుస్తున్నాయి. ముఖ్యంగా కోకాపేట్ ప్రాంతంలో అయితే చుట్టూ ఇవే కన్పిస్తాయి. నగరంలో దాదాపుగా 100 వరకు హైరైజ్ టవర్లు ఉండవచ్చని ఓ అంచనా. ఇందులో కనీసం 30 నుంచి గరిష్టంగా 50 అంతస్థుల వరకు నిర్మిస్తున్నారు. కొన్ని నిర్మాణంలో ఉంటే మరికొన్ని నిర్మాణం పూర్తయి నివాసం ఉంటున్న పరిస్థితి. మరి ఈ టవర్లలో భద్రత ఎంతవరకు ఉందనే ప్రశ్న వస్తోంది. హాంకాంగ్ ప్రమాదం నేపధ్యంలో ఇక్కడి టవర్లలో నివసిస్తున్నవారిలో భయం వెంటాడుతోంది.
హైరైజ్ టవర్లలో ఎలాంటి భద్రత ఉండాలి Safety in High Rise Towers
1. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎదుర్కొనేందుకు ఎవాక్యువేషన్ ప్లాన్ సిద్ధంగా ఉండాలి. అత్యవసర ఎగ్జిట్ పాయింట్లు ఉండాలి.
2. స్మోక్ డిటెక్టర్లు, స్ప్రింక్లర్లు, ఫైర్ అలార్మ్స్ ప్రతి ఫ్లోర్‌లో తప్పనిసరి
3. ప్రతి టవర్‌లో కనీసం రెండు మెట్ల మార్గాలుండాలి.
4. కిటికీలు, తలుపులు అగ్ని నిరోధకమై ఉండాలి.
5. ప్రతి టవర్‌లో అగ్నిమాపక సిబ్బంది ఉపయోగించేందుకు వీలుగా ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్ట్ ఉండాలి.
6. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా తప్పించుకోవాలనే విషయంలో అవగాహన కలిగేలా క్రమం తప్పకుండా డ్రిల్స్ జరుగుతుండాలి.
మరి ఈ భద్రతా ప్రమాణాలు హైదరాబాద్ టవర్లలో ఉన్నాయా అనేది ఓ ప్రధానమైన ప్రశ్న. ఏదైనా జరగానికి జరిగితే రక్షించే పరిస్థితి ఉందా లేదా అనేది సందేహంగా మారింది. రోజురోజుకూ పెరుగుతున్న హైరైజ్ టవర్ల ఎంతవరకు సేఫ్ అనేది చర్చనీయాంశంగా మారింది.

