India Russian Oil Strategy: రష్యా నుంచి చమురు దిగుమతులపై పశ్చిమ దేశాల ఒత్తిడి కొనసాగుతున్న వేళ, ప్రభుత్వ రంగ దిగ్గజం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL) తన వ్యూహాన్ని స్పష్టం చేసింది. రష్యన్ చమురు కొనుగోళ్లపై తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రత్యేక ఆదేశాలు లేవని, కేవలం ఆర్థిక ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటున్నామని సంస్థ ఛైర్మన్, ఎండీ వికాస్ కౌశల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆదేశాలు లేకుండానే రష్యన్ చమురు ప్రాసెసింగ్‌ను HPCL ఎందుకు తగ్గించింది..? భవిష్యత్తులో అంతర్జాతీయ ఆంక్షల ప్రభావం సంస్థపై ఎలా ఉండబోతోంది..? ఈ ప్రశ్నలకు ఆయన సమాధానాలు దేశ ఇంధన భద్రతపై కొత్త చర్చకు తెరలేపాయి.
ప్రభుత్వ ఆదేశాలు లేవు – ఆర్థికమే ఆధారం : HPCL ఛైర్మన్ వికాస్ కౌశల్ ప్రకారం, రష్యన్ ముడి చమురు దిగుమతులపై ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. భౌగోళిక రాజకీయ పరిస్థితుల కన్నా, ఆర్థికపరమైన అంశాలే తమ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయని ఆయన కుండబద్దలు కొట్టారు. “ఆర్థికంగా ఎక్కడ తక్కువ ధరకు ముడి చమురు లభిస్తే అక్కడే కొనుగోలు చేస్తాం. ఇది మా వ్యాపార ధర్మం,” అని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ భవిష్యత్తులో ఏవైనా ఆంక్షల కారణంగా రష్యన్ చమురు కొనుగోలును నిలిపివేయాల్సి వస్తే, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే పూర్తి స్వేచ్ఛ తమకు ఉందని ఆయన భరోసా ఇచ్చారు.
ALSO READ: https://teluguprabha.net/international-news/trump-india-trade-talks-dispute/
తగ్గిన రష్యన్ చమురు వాటా – కారణం ఇదే : ఒకప్పుడు రష్యన్ చమురు కోసం ఎగబడిన HPCL, ఇప్పుడు ఆ దిగుమతులను గణనీయంగా తగ్గించింది. దీనికి ప్రధాన కారణం మాస్కో ఇచ్చే డిస్కౌంట్లు తగ్గడమే. జూన్ 30, 2025తో ముగిసిన త్రైమాసికంలో, HPCL ప్రాసెస్ చేసిన మొత్తం ముడి చమురులో రష్యన్ చమురు వాటా 13.2 శాతానికి పడిపోయింది. రష్యా బ్యారెళ్లపై పోటీతత్వం తగ్గడంతో, ఇతర దేశాల నుంచి కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నట్లు సంస్థ తెలిపింది. “మనం రష్యా నుంచి చమురు తీసుకోవడం మానేసినా, కంపెనీకి పెద్దగా నష్టం ఏమీ ఉండదట. ఆ ప్రభావం మనపై అంతగా పడదని కౌశల్ గారు చెప్పారు.”
మారిన దిగుమతుల స్వరూపం : రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందు, భారతదేశపు చమురు దిగుమతుల్లో రష్యా వాటా రెండు శాతం కంటే తక్కువగా ఉండేది. యుద్ధం తర్వాత పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో, మాస్కో తన చమురుపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి భారీగా దిగుమతులు చేసుకున్నాయి. ఫలితంగా, కొన్ని నెలల్లోనే ఇరాక్, సౌదీ అరేబియా వంటి సంప్రదాయ సరఫరాదారులను వెనక్కి నెట్టి రష్యా భారతదేశానికి ప్రధాన చమురు సరఫరాదారుగా అవతరించింది. ఒక దశలో భారత మొత్తం దిగుమతుల్లో రష్యా వాటా 35-40 శాతానికి చేరింది. అయితే, ఇప్పుడు డిస్కౌంట్లు తగ్గడంతో పరిస్థితి మళ్లీ మారుతోంది.
ALSO READ: https://teluguprabha.net/international-news/trump-putin-meeting-zelenskyy-precondition/
పశ్చిమ దేశాల ఒత్తిడి – వాస్తవ పరిస్థితి :ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని అమెరికా, ఐరోపా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దని భారత్‌పై ఒత్తిడి తెస్తున్నాయి. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ భారత దిగుమతులపై 50 శాతం టారిఫ్‌లు విధించారని వచ్చిన వార్తలను భారత్ ఖండించింది. ఇటువంటి చర్యలు అసమర్థమైనవిగా అభివర్ణించింది. అయితే, పశ్చిమ దేశాల ఒత్తిడి, G7 దేశాలు విధించిన ధరల పరిమితి (Price Cap) వంటి అంశాలు భారత ప్రభుత్వ రంగ సంస్థల వ్యూహాలను ప్రభావితం చేస్తున్నాయన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో HPCL వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


