Homeఇంటర్నేషనల్Venus: శుక్రుడి ఉపగ్రహం ఉంటే.. గ్రహానికే ఢీ!

Venus: శుక్రుడి ఉపగ్రహం ఉంటే.. గ్రహానికే ఢీ!

  • భ్రమణ వేగం తక్కువే.. గురుత్వాకర్షణ ప్రభావంతో శుక్రుడిపైకి పతనం?
  • ఇతర ‘భూమి’ గ్రహాల నివాసయోగ్యతపైనా ప్రభావం ఉండొచ్చని శాస్త్రవేత్తల అంచనా
  • భూమికి కవలగా భావించే గ్రహంపై ది ఆస్ట్రోఫిజికల్‌ జర్నల్‌’లో ఆసక్తికర అధ్యయనం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15(తెలుగుప్రభ): భూమికి కవలగా భావించే శుక్రుడికి ఒకప్పుడు ఉపగ్రహం ఉండి.. గ్రహం గురుత్వాకర్షణ, అత్యంత నెమ్మదైన భ్రమణ వేగం కారణంగా అది శుక్రుడినే ఢీకొని ఉండొచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం-రివర్‌సైడ్‌కు చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ కేన్‌ నేతృత్వంలో నిర్వహించిన ఈ పరిశోధన ‘ది ఆస్ట్రోఫిజికల్‌ జర్నల్‌’లో ప్రచురితమైంది.

- Advertisement -

భ్రమణ వేగమే కీలకం
భూమి 24 గంటల్లో ఒకసారి తన చుట్టూ తిరుగుతుంది. ఈ వేగవంతమైన భ్రమణం వల్ల శక్తి ఉపగ్రహానికి బదిలీ కావడంతో అది భూమికి దూరంగా వెళ్తుంది. శుక్రుడి పరిస్థితి ఇందుకు భిన్నం. ఆ గ్రహం తన చుట్టూ ఒకసారి తిరగడానికి ఏకంగా 243 భూమి రోజులు పడుతుంది. దీంతో శుక్రుడి గురుత్వాకర్షణ ప్రభావానికి లోనైన ఉపగ్రహం క్రమంగా గ్రహం వైపు దూసుకెళ్లి ఢీకొనే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు.

పలు నమూనాలతో పరీక్ష
పరిశోధకులు ముందుగా భూమి-చంద్రుడి వ్యవస్థను నమూనాగా రూపొందించి తమ గణనల ఖచ్చితత్వాన్ని పరిశీలించారు. అనంతరం శుక్రుడి భ్రమణ వేగాన్ని, ఊహాజనిత ఉపగ్రహాల పరిమాణాలను మార్చుతూ అనేక నమూనాలను పరీక్షించారు. భూమి చంద్రుడి ద్రవ్యరాశిలో సగం నుంచి పది రెట్ల వరకు ఉన్న ఉపగ్రహాలను పరిశీలించారు. చాలా సందర్భాల్లో ఫలితం ఒకటే వచ్చింది. ఉపగ్రహం శుక్రుడిపైకి పతనమైంది. ఉపగ్రహం ద్రవ్యరాశి పెరిగే కొద్దీ అది మరింత వేగంగా గ్రహాన్ని ఢీకొన్నట్లు తేలింది.

ఇప్పటికీ నిర్ధారణ కాలేదు
శుక్రుడికి గతంలో ఉపగ్రహం ఉండేదని ఈ అధ్యయనం నిరూపించలేదు. అయితే అలాంటి ఉపగ్రహం ఏర్పడి ఉంటే.. అది శాశ్వతంగా కొనసాగి ఉండేది కాదని పరిశోధకులు చెబుతున్నారు. శుక్రుడి నెమ్మదైన భ్రమణం, గురుత్వాకర్షణ కలిసి చివరకు దాన్ని గ్రహం వైపు లాగి ఉండొచ్చని పేర్కొన్నారు. ఇతర నక్షత్రాల చుట్టూ భూమిని పోలిన గ్రహాలను గుర్తించినప్పుడు వాటికి ఉపగ్రహం ఉందా? అన్న ప్రశ్న కీలకంగా మారుతుందని కేన్‌ తెలిపారు. గ్రహం తగినంత వేగంగా తిరగకపోతే.. దాని ఉపగ్రహం చివరకు గ్రహాన్నే ఢీకొని ఆ గ్రహం పరిణామ గతిని మార్చే అవకాశం ఉందని వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News