Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Trump tariffs : రష్యా చమురుపై ట్రంప్ కొరడా.. భారత్ వెనక్కి తగ్గిందా..? తెర వెనుక...

Trump tariffs : రష్యా చమురుపై ట్రంప్ కొరడా.. భారత్ వెనక్కి తగ్గిందా..? తెర వెనుక కథేంటి..?

Impact of US tariffs on India-Russia oil trade : రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశం ఈ చర్యను తీవ్రంగా తప్పుపట్టారు  ఏకంగా 25 శాతం అదనపు సుంకాన్ని బాదారు. ఈ పెనాల్టీ బుధవారం నుంచే అమల్లోకి రానుంది. సరిగ్గా ఇదే సమయంలో, ఆగస్టు నెలలో రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు గణనీయంగా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇంతకీ, ట్రంప్ సుంకాల దెబ్బకు భారత్ వెనక్కి తగ్గిందా..? రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపిందా..? తెర వెనుక అసలు కథేంటి..? రాబోయే రోజుల్లో మన వైఖరి ఎలా ఉండబోతోంది..?

- Advertisement -

దిగుమతులు తగ్గాయి.. కానీ కారణం అది కాదు : మార్కెట్ విశ్లేషకుల లెక్కల ప్రకారం, ఆగస్టు 24వ తేదీ వరకు రష్యా నుంచి భారత్‌కు రోజుకు సగటున 16 లక్షల బ్యారెళ్ల ముడి చమురు మాత్రమే దిగుమతి అయింది. జులై నెలతో పోలిస్తే ఇది 37 శాతం తక్కువ. ఈ అంకెలు చూడగానే, అమెరికా హెచ్చరికలకు మన దేశం తలొగ్గిందని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే, అంతర్జాతీయ ముడి చమురు ఒప్పందాలు చాలా ముందుగానే జరుగుతాయి. ఆగస్టు నెలలో మనకు సరఫరా అయిన చమురు కోసం భారత రిఫైనరీలు జూన్ చివరి వారంలో లేదా జులై మొదటి వారంలోనే ఆర్డర్లు ఇచ్చాయి. కానీ, ట్రంప్ సుంకాల బాదుడు ప్రకటనలు వెలువడింది ఆగస్టు మొదటి వారంలో. కాబట్టి, ఆగస్టులో దిగుమతులు తగ్గడానికి, ట్రంప్ సుంకాలకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని బెల్జియంకు చెందిన అంతర్జాతీయ వాణిజ్య విశ్లేషక సంస్థ ‘కెప్లర్’ (Kpler) స్పష్టం చేస్తోంది.

అసలు కారణం.. బేరంలోనే ఉంది : మరి దిగుమతులు ఎందుకు తగ్గాయి? అసలు కారణం బేరంలోనే ఉంది. గతంలో రష్యా తన ముడి చమురుపై భారత్ వంటి దేశాలకు బ్యారెల్‌పై భారీగా రాయితీలు ఇచ్చేది. అయితే, ఇటీవల ఆ రాయితీలకు రష్యా గణనీయంగా కోత పెట్టింది. “ప్రస్తుతం రష్యా నుంచి కొనే చమురుపై బ్యారెల్‌కు కేవలం 1.5 డాలర్ల రాయితీ మాత్రమే లభిస్తోంది,” అని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం (BPCL) డైరెక్టర్ (ఫైనాన్స్) వెత్స రామకృష్ణ గుప్తా ఆగస్టు ఆరంభంలోనే వెల్లడించారు. అంటే, రాయితీలు ఆకర్షణీయంగా లేకపోవడంతోనే భారత రిఫైనరీలు రష్యా నుంచి కొనుగోళ్లను తగ్గించి, పశ్చిమాసియా వంటి ఇతర ప్రత్యామ్నాయాల వైపు చూశాయి. ఇది పూర్తిగా వ్యాపారపరమైన నిర్ణయమే తప్ప, రాజకీయ ఒత్తిడి కాదని స్పష్టమవుతోంది.

అసలు పరీక్ష ముందుంది.. సెప్టెంబర్‌, అక్టోబర్‌లే కీలకం : ట్రంప్ సుంకాల ప్రభావం భారత్‌పై నిజంగా ఎంతవరకు ఉందనేది తెలియాలంటే మనం సెప్టెంబర్, అక్టోబర్ నెలల దిగుమతుల లెక్కల కోసం వేచి చూడాలి. భారతీయ రిఫైనరీలు ఆ నెలల సరఫరాకు సంబంధించి, ట్రంప్ సుంకాల ప్రకటన వెలువడిన అనంతరం మాత్రమే ఆర్డర్లను ఖరారు చేశాయి. దీని ద్వారా మన వ్యూహాత్మక ప్రణాళిక బహిర్గతమవుతుంది

“ప్రస్తుతానికి రష్యా నుంచి సూయజ్ కాలువ వైపు వస్తున్న చమురు ట్యాంకర్ల కదలికలు ఉన్నాయి. కానీ అవి భారత్‌కే వస్తాయా లేక ఇతర ఆసియా దేశాలకు వెళ్తాయా అనేది ఇప్పుడే చెప్పలేం. “భారత్ అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గిందని ప్రస్తుతం మనం ఒక నిర్ణయానికి రాలేము,” అని ‘కెప్లర్’ సంస్థకు చెందిన ఇంధన రంగ విశ్లేషకుడు సుమిత్ రితోలియా అభిప్రాయపడ్డారు. గతంలో ఈ ట్యాంకర్లు పలుమార్లు నేరుగా భారత రిఫైనరీలకే వచ్చాయని, కాబట్టి వేచి చూడాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad