Reham Khan New Party: పాకిస్థాన్ రాజకీయ సంగ్రామంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశానికి చెందిన ప్రముఖ జర్నలిస్టు, పాకిస్థాన్ తహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య అయిన రెహమ్ ఖాన్, తాజాగా తన రాజకీయ పార్టీని స్థాపించారు. ప్రజల వాణిగా నిలిచి, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే లక్ష్యంతో ‘పాకిస్తాన్ రిపబ్లిక్ పార్టీ’ని ఆమె ప్రారంభించినట్లు తెలియజేశారు.
కరాచీలో జరిగిన మీడియా సమావేశంలో రెహమ్ మాట్లాడుతూ.. గతంలో తన రాజకీయాల్లో ప్రవేశం పూర్తిగా వ్యక్తిగత సంబంధాల నేపథ్యంలో జరిగిందని పేర్కొన్నారు. అయితే ఈసారి మాత్రం ప్రజల కోసం, దేశానికి మార్పు తీసుకురావాలనే దృక్పథంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు వెల్లడించారు.
తన పార్టీ కేవలం ఒక రాజకీయ వేదిక మాత్రమే కాదని, సేవా దృక్పథంతో ముందుకు సాగే ఉద్యమమని ఆమె స్పష్టం చేశారు. దేశ ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, పాలక వ్యవస్థపై నమ్మక లోపం వంటి అంశాలు తాను పార్టీ ప్రారంభించడానికి ప్రేరణగా నిలిచాయని తెలిపారు. ప్రజల సమస్యలపై ప్రశ్నలు వేయడం, మార్పు కోసం కృషి చేయడమే తమ ప్రాథమిక లక్ష్యమని అన్నారు.
దేశంలో తీవ్రమైన పేదరికం, తాగునీటి కొరత, కనీస మౌలిక వసతుల లేకపోవడాన్ని ఆమె ఆవేదనతో ప్రస్తావించారు. “2012 నుంచి ఇప్పటికీ పలు ప్రాంతాల్లో తాగునీరు వంటి అత్యవసర వనరులు కూడా అందుబాటులో లేవు. ఇది చాలా బాధాకర విషయం,” అని వ్యాఖ్యానించారు. కుటుంబ ఆధారిత రాజకీయాలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఏవిధమైన రాజకీయ మద్దతు లేకుండానే పార్టీని ఏర్పాటు చేశామని తెలిపారు. తనకు అధికారం రావడమే లక్ష్యం కాదని, మార్పు కోసం ప్రజలతో కలిసి ముందుకు వెళ్లడమే ధ్యేయమని స్పష్టం చేశారు. పార్టీ మేనిఫెస్టోను త్వరలో విడుదల చేయనున్నట్లు కూడా ఆమె తెలిపారు. ఈ కొత్త రాజకీయ ప్రయాణంతో రెహమ్ ఖాన్ పాకిస్థాన్ రాజకీయ దృశ్యానికి ఎలా మార్పులు తీసుకురాబోతారో చూడాలి.
అయితే మాజీ ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం బెయిల్ పొంది ప్రస్తుతం బయట ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం.. ఇమ్రాన్ ఖాన్ చేసిన అవినీతి కారణంగా అతడిని జైలులో ఉంచిన విషయం తెలిసిందే. అయితే బెయిల్ అనంతరం ఇమ్రాన్ ఖాన్ రాజకీయాల్లో కాస్త చల్లబడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతని మాజీ భార్య సరికొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఇమ్రాన్ ఖాన్ పన్నాగంలో భాగాంగానే అతని మాజీ భార్యతో పార్టీని పెట్టించారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఒకవేళ ఎన్నికలు వస్తే రెహమా ఖాన్ ఇమ్రాన్‌తో పొత్తు పెట్టుకుంటుందా లేదా అనేది కూడా ఆసక్తికరమైన విషయమే.


