IND- CHINA Direct Flights Start: దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత భారత్- చైనా మధ్య ప్రత్యక్ష విమానాలు అధికారికంగా తిరిగి ప్రారంభమయ్యాయి. ఇండిగో తన కోల్‌కతా- గ్వాంగ్‌జౌ మార్గాన్ని ఈ రోజు(అక్టోబర్ 26) ప్రారంభించింది. కాగా, ఢిల్లీ- షాంఘై విమానాలు నవంబర్ 9న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆదివారం, భారత్‌లో చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యు జింగ్ దీనిని ‘X’ వేదికగా ధ్రువీకరించారు. ‘చైనా, భారతదేశం మధ్య ప్రత్యక్ష విమానాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.’ అని పేర్కొన్నారు.
భారత్- చైనా సరిహద్దులో గల్వాన్ లోయ ఘర్షణలు, కొవిడ్- 19 ప్రభావంతో ఇరు దేశాల మధ్య విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. కాగా, ఇటీవల భారత్- పాక్ మధ్య యుద్ధాలు, ఆపరేషన్ సిందూర్, ట్రంప్ సుంకాల మోత ప్రభావంతో డ్రాగన్‌తో ఇండియాకు మళ్లీ సత్సంబంధాలు ఏర్పడ్డాయి. పలు అంతర్జాతీయ సమావేశాల్లోనూ ఈ విషయం సుస్పష్టంగా అర్థమైంది.
ఈ క్రమంలో దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత.. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో వాణిజ్యం, పర్యాటక రంగాలతో పాటు దౌత్య సంబంధాలను పునరుద్ధరించడంలో కీలక అడుగు పడినట్లే అని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.
Also Read: https://teluguprabha.net/viral/pm-modi-official-convoy-were-allegedly-spotted-at-a-local-car-wash/
కోల్‌కతా- గ్వాంగ్‌జౌ మధ్య విమానం కూడా ఈ రోజు ప్రారంభం కాగా.. షాంఘై-న్యూఢిల్లీ విమానం నవంబర్ 9న ప్రారంభమవుతుంది. ఇరు దేశాల మధ్య వారానికి మూడు విమానాలు రాకపోకలు సాగిస్తాయి. అంతే కాకుండా కొవిడ్-19 సస్పెన్షన్ తర్వాత చైనాకు తన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిన మొదటి విమానయాన సంస్థల్లో ఇండిగో ఒకటిగా నిలిచింది. అక్టోబర్ 26, 2025న కోల్‌కతా- గ్వాంగ్‌జౌ మధ్య డైలీ నాన్‌స్టాప్ విమానాలను ప్రారంభిస్తామని, అక్టోబర్ 2న ఇండిగో ప్రకటించింది. కాగా, గ్వాంగ్‌జౌ- ఢిల్లీ మధ్య ప్రత్యక్ష విమానాల విస్తరణ మాత్రం.. అధికారుల ఆమోదం కోసం వేచి ఉంది.



